కరోనా కేసు ఒకటి కూడా నమోదుకాని రోజు.. ముంబై!

     Written by : smtv Desk | Wed, Jan 25, 2023, 01:41 PM

కరోనా కేసు ఒకటి కూడా నమోదుకాని రోజు.. ముంబై!

భారతదేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా ముంబై నగరం నిలిచింది. కోవిడ్ మొదటి మరియు రెండవ దశలలో దేశంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర వ్యాప్తంగానూ, ముంబై నగరంలోనూ నమోదయ్యాయి. మరణాలు కూడా అధికంగా నమోదయ్యాయి. సమస్యను ఎలా కట్టడి చేయాలో తెలియక నాటి ఉద్ధవ్ థాకరే సర్కారు తల పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ముంబై వ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు 11 వేలకు పైన, మొత్తం కేసులు రూ.5 లక్షలకు పైన ఎన్నో రోజుల పాటు నమోదయ్యాయి.

కానీ మూడేళ్లు తిరిగే సరికి పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చింది. మంగళవారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వ్యాప్తంగా 2,772 కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ, ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. 2020 మార్చి 16 వరకు అక్కడ కరోనా కేసులు లేవు. ఆ తర్వాత మళ్లీ కరోనా లేని రోజంటే ఇదే. దీనిపై బీఎంసీ ఆరోగ్య విభాగం సిబ్బంది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్ల కాలం తమకు పరీక్ష వంటిదన్నారు. కేసుల్లేకపోయినా.. రోజువారీ పరీక్షలు, నిఘా కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అంతా బాగుంది అనుకుని ఇష్టానికి ప్రవర్తిస్తే ముప్పు తప్పదనే విషయాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకోక తప్పదు మరీ.





Untitled Document
Advertisements