గవర్నర్ పై కేసు విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం..

     Written by : smtv Desk | Mon, Jan 30, 2023, 04:58 PM

 గవర్నర్ పై కేసు విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం..

తెలంగాణా సర్కార్ రాష్ట్ర గవర్నర్ పై హైకోర్టులో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంత వరకు ఆమోదం తెలపలేదంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. అయితే పిటిషన్ విషయంలో తెలంగాణా సర్కార్ వెనక్కి తగ్గింది. పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 3న సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు లేఖను పంపించింది.
అయితే రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి రిటర్న్ లేఖ వెళ్లింది. శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని.. దానికి సంబంధించిన కాపీని తమకు పంపించారా? లేదా? అని రాజ్ భవన్ ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ సర్కార్ స్పందించకపోవడంతో.. గవర్నర్ కూడా ఆమోదం తెలపకుండా ఉండిపోయారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలకు సమయం దగ్గర పడటంతో ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది. దీంతో, ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా పిటిషన్ ను ఉపసంహరించుకుంది. రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మరి ఈ సమావేశాలు నిర్వహించే రోజు దగ్గర పడుతున్నా ఈ విషయం ఎటు తేలకపోవడం గమనార్హం.





Untitled Document
Advertisements