ప్రపంచ దేశాల దృష్టి భారత్ పైనే ఉంది.. బడ్జెట్ సెషన్స్ కు ముందు ప్రధాని మోదీ

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 11:47 AM

ప్రపంచ దేశాల దృష్టి భారత్ పైనే ఉంది..  బడ్జెట్ సెషన్స్ కు ముందు ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా కాసేపట్లో మొదలు కానున్న ఈ సంవత్సరపు వార్షిక బడ్జెట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంటులో అంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్న 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం యావత్ ప్రపంచం అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో అన్ని దేశాల దృష్టి మన దేశ బడ్జెట్ పైనే ఉందని తెలిపారు. మన బడ్జెట్ ప్రపంచ దేశాలకు ఒక మార్గాన్ని చూపెడుతుందనే ఆశాభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులోని ఉభయసభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించబోతున్నారని అన్నారు. ఇది మన దేశ రాజ్యాంగం, ముఖ్యంగా మహిళలకు గర్వకారణమని చెప్పారు.

'ఇండియా ఫస్ట్, సిటిజెన్ ఫస్ట్' అనే నినాదాన్ని ఈ బడ్జెట్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ తెలిపారు. విపక్ష నేతలు పార్లమెంటు సమావేశాల్లో వారి విలువైన సూచనలను ఇస్తారనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. దేశ ప్రజలందరి ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ కూర్పులో కృషి చేశారని నమ్ముతున్నానని తెలిపారు. రాష్ట్రపతితో పాటు, మన ఆర్థిక మంత్రి కూడా మహిళే కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం మన బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. మరోవైపు, కాసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు చేరుకున్నారు.





Untitled Document
Advertisements