బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి తొలి ప్రసంగం.. హైలైట్స్

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 12:30 PM

 బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి తొలి ప్రసంగం.. హైలైట్స్

పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఉదయం 11 గంటలకు పార్లమెంటుకు చేరుకున్న ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బాయ్ కాట్ చేయగా.. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సోమవారం శ్రీనగర్ లో రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఎంపీలు.. మంగళవారం కూడా అక్కడే ఉండిపోయారు. కాంగ్రెస్ తరఫున పార్టీ మాజీ చీఫ్, ఎంపీ సోనియా గాంధీ సభకు హాజరయ్యారు. పార్లమెంట్ లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు.

రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలోని హైలెట్స్..
రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో ముఖ్యమని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. పౌరులందరి అభివ‌ృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడుకునే విషయంపై దృష్టి పెట్టామని తెలిపారు. కొన్ని రోజుల ముందే 75 ఏళ్ల స్వతంత్ర భారత ఉత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
విధాన లోపాన్ని అధిగమించి దేశం ముందుకెళుతోందని రాష్ట్రపతి చెప్పారు. దేశం ఆత్మనిర్భర్ భారత్ గా మారుతోందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని వివరించారు. ఆదాయ పన్ను విధానాన్ని తమ ప్రభుత్వం మరింత సరళతరం చేసిందని, పన్ను రిటర్నులు పొందడం కూడా ప్రస్తుతం సులభంగా మారిందని చెప్పారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. పౌర సేవల్లో సాంకేతికత ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. బినామీ ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రపతి వివరించారు.
సరిహద్దుల్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని రాష్ట్రపతి చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా దేశ సరిహద్దులు దాటి ముష్కరులను అంతమొందించామని గుర్తుచేశారు. దేశంలోని ప్రతీ ఇంటికీ మంచినీటిని చేర్చేందుకు తమ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రారంభించిందని చెప్పారు. ట్రిపుల్ తలాక్, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
భారత్ పై ప్రపంచం ఆధారపడేలా మార్పు తెచ్చామని ముర్ము చెప్పారు. కరోనా కాలంలో కోట్లాదిమందిని తన ప్రభుత్వం ఆదుకుందని, పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదరికంలేని దేశ నిర్మాణం జరగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.





Untitled Document
Advertisements