సచిన్ చేతుల మీదుగా అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ

     Written by : smtv Desk | Tue, Jan 31, 2023, 12:39 PM

సచిన్ చేతుల మీదుగా అండర్ 19 మహిళల ప్రపంచకప్ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ

మహిళ క్రికెట్ మొదలై ఏళ్ళు గడుస్తున్నా వారికి సరైన గుర్తింపు అనేది లభించలేదు అనే చెప్పాలి. అయితే, మొట్టమొదటి సారి నిర్వహించిన అండర్ 19 మహిళల ప్రపంచకప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్స్ లో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి మన భారత అమ్మాయిలు ప్రపంచ విజేతలుగా నిలిచారు. భారత్ కు ప్రపంచకప్ ను తెచ్చిన యువ మహిళా ప్లేయర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. వరల్డ్ కప్ ను గెలుపొందిన జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ. 5 కోట్లను నజరానాగా ప్రకటించింది. మరోవైపు జట్టు సభ్యులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ప్రపంచకప్ విజేతలను బీసీసీఐ సత్కరించనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందిస్తూ... భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపిన అండర్ 19 మహిళా జట్టు సభ్యులకు సచిన్ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్స్ సమక్షంలో సత్కార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. యువ క్రికెట్లర్లు మన దేశం గర్వపడేలా చేశారని కొనియాడారు. ఈ గెలుపుతో అమ్మాయిలు మరింత ఎక్కువగా క్రికెట్ పట్ల మక్కువ చూపించే అవకాశాలు పెరిగాయి అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

Untitled Document
Advertisements