6వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి.. ముగిసిన బీఎసీ సమావేశాలు

     Written by : smtv Desk | Fri, Feb 03, 2023, 02:53 PM

 6వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి.. ముగిసిన బీఎసీ సమావేశాలు

నేటి ఉదయం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు శాసనసభలో చర్చించాలని బీఏసీలో నిర్ణయించారు. 6వ తేదీన (సోమవారం) ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 8వ తేదీన బడ్జెట్, పద్దులపై చర్చిస్తారు.
మరోవైపు బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని కోరారు. ప్రొటోకాల్ సమస్యను కూడా ఆయన ప్రస్తావించారు. అనేక సమస్యలపై సభలో చర్చించాల్సి ఉందని చెప్పారు. దీంతో, తొలుత బడ్జెట్ పై చర్చిద్దామని.. ఆ తర్వాత మిగిలిన అంశాలపై చర్చిద్దామని ప్రభుత్వం తెలిపింది. సమావేశాల కొనసాగింపుకు సంబంధించి ఈ నెల 8న మరోసారి బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
బీఏసీ సమావేశానంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఏసీ సమావేశానికి అన్ని ప్రతిపక్షాలను పిలిస్తే బాగుండేదని చెప్పారు. బడ్జెట్ పై 6 రోజులు, డిమాండ్లపై 18 రోజుల చర్చ ఉండాలని కోరానని తెలిపారు. నిరుద్యోగం, ప్రజల సమస్యలపై చర్చ జరగాలని కోరానని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Untitled Document
Advertisements