రెడ్ మీ వారి సరికొత్త ఆవిష్కరణ.. 5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్

     Written by : smtv Desk | Wed, Mar 01, 2023, 12:00 PM

రెడ్ మీ  వారి సరికొత్త ఆవిష్కరణ.. 5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్

ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు మొదలుకుని పెద్ద వయసు వారి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగానికి అలవాటు పడ్డారు. ఎంతలా అంటే గట్టిగా ఓ ఐదు నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండడాన్ని చాలా మంది బోర్ గా ఫీలవుతుంటారు. చార్జింగ్ కోసం గంట నుంచి రెండు గంటలను ఫోన్ పక్కన పెట్టడం అన్నది చాలా మందికి నచ్చని అంశం. అందుకే కొందరు చార్జింగ్ పెట్టి మరీ చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఇబ్బంది లేకుండా రెడ్ మీ పరిష్కారాన్ని కనుగొన్నది.

కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ పూర్తయ్యే 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రెడ్ మీ ఆవిష్కరించింది. 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని 5 నిమిషాల్లో చార్జ్ చేసేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో చైనీస్ సోషల్ మీడియా యాప్ వీబోలో దర్శనమిచ్చింది. రెడ్ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ స్మార్ట్ ఫోన్, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని 300 వాట్ చార్జర్ తో చార్జింగ్ చేసి చూసింది. అసలు ఫోన్ లో 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, ఐదు నిమిషాల్లో చార్జింగ్ పరీక్ష పూర్తి చేసేందుకు వీలుగా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీని వినియోగించారు.

50 శాతం చార్జింగ్ ను కేవలం 3 నిమిషాల్లో పూర్తి చేసింది. చైనాకు చెందిన రియల్ మీ సైతం ఇటీవలే 240 వాట్ ఫాస్ట్ చార్జర్ టెక్నాలజీని ఆవిష్కరించడం గమనార్హం. ఈ చార్జర్ తో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లోనే చార్జ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం మనకు కూడా అందుబాటులోకి రానుంది.





Untitled Document
Advertisements