బడ్జెట్ సమావేశాలలో నారీమణులపై బుగ్గన కవిత

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 12:05 PM

బడ్జెట్ సమావేశాలలో నారీమణులపై బుగ్గన కవిత

ప్రస్తుతం ఏపీలో నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పాటుపడుతోందని అసెంబ్లీలో వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల సర్వతోముఖాభివృద్ధికి తమ సర్కార్ కృషి చేస్తోందని, ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల గురించి రాసిన ఓ కవితను ఆయన ప్రస్తావించారు.

‘మహిళలు స్ఫూర్తిప్రదాతలు.. తమ అనుభవాలను జీవితపాఠాలుగా మలిచే మణిపూసలు.. మహిళలు పకృతికి మరో రూపాలు.. మహిళలు మహిలో నడయాడే ఆదిపరాశక్తులు’ అంటూ మంత్రి కవితను చదివి వినిపించారు.

దీనిపై సభలో ఉన్న మహిళల నుంచి స్పందన రాకపోవడంతో మంత్రి వారివేపు చూస్తూ ‘ఏమ్మా మరోసారి వినిపించనా’ అని అడిగారు. దీంతో స్పందించిన మహిళా ఎమ్మెల్యేలు చప్పట్లు చరుస్తుండగా మంత్రి మరోమారు కవితను చదివారు. ఈసారి ఎమ్మెల్యేలంతా బల్లలు చరుస్తూ మంత్రి బుగ్గనను అభినందించారు. ఈ క్రమంలో మహిళల కోసం బడ్జెట్ లో జరిపిన కేటాయింపులు కొన్నింటిని మంత్రి చదివి వినిపించారు.

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించామని బుగ్గన తెలిపారు. వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి రూ.200 కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6,500 కోట్లు కేటాయింపులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.





Untitled Document
Advertisements