కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు.. ఈ నెల 20న విచారణకు

     Written by : smtv Desk | Thu, Mar 16, 2023, 03:37 PM

కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు.. ఈ నెల 20న విచారణకు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను ఇప్పటికే ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు లిక్కర్ స్కామ్ కేసులో కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరవ్వాల్సి వున్న నేపధ్యంలో ఆమె ఈడీ విచారణకు వెళ్ళలేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో హైడ్రామా కొనసాగుతోంది. విచారణకు రావాలంటూ కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు పంపింది.

లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా ఈనెల 11న కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. రెండో విడత విచారణకు ఈరోజు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె వెళ్లలేదు. ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ చెప్పారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత వేసిన పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కానీ దాని కంటే ముందే 20న హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈరోజు ఈడీ ఆఫీసుకు వచ్చేందుకు నిరాకరించిన కవిత.. 20న మాత్రం విచారణకు హాజరవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ 20న కవిత హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.





Untitled Document
Advertisements