నేను బటన్ నొక్కితే డబ్బు ప్రజలకు వెళుతుంది, చంద్రబాబు నొక్కితే ఆయన ఖాతాకు వెళుతుంది.. జగన్

     Written by : smtv Desk | Mon, Mar 20, 2023, 04:55 PM

నేను బటన్ నొక్కితే డబ్బు ప్రజలకు వెళుతుంది, చంద్రబాబు నొక్కితే ఆయన ఖాతాకు వెళుతుంది.. జగన్

నేటి ఉదయం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ కొనసాగుతున్నాయి. ఉదయం అధికార వైసీపీ మరియు ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణలు, దాడులు చోటు చేసుకున్నాయి. అదే విధంగా కన్నబాబు సభలో ప్రసంగిస్తూ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం గురించి ప్రస్తావించారు. అదే విషయాన్ని జగన్ సైతం అసెంబ్లీలో ప్రసంగిస్తూ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంను ప్రస్తావిస్తూ చంద్రబాబుపైనా, గత టీడీపీ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కాం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ అని ఎద్దేవా చేశారు.

రూ.100 పనికి రూ.10 అడ్వాన్స్ గా తీసుకుని, ఆ రూ.10ని కూడా దోచుకున్న తీరుగా ఈ స్కాం ఉందని సీఎం జగన్ వివరించారు. దేశ చరిత్రలోనే ఇదొక పెద్ద స్కాం అని పేర్కొన్నారు.

"ఈ స్కాంను నడిపింది సాక్షాత్తు చంద్రబాబు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. ఈ డబ్బు షెల్ కంపెనీల ద్వారా రకరకాల మార్గాల్లో వెళ్లి, తిరిగి ఆ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు వద్దకు వచ్చింది. దోచేసిన డబ్బు జేబులోకి ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. నేను బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి సొమ్ము వెళుతుంది.. చంద్రబాబు బటన్ నొక్కితే ఆయన ఖాతాలోకి డబ్బులు వస్తాయి.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కాం ఊపిరి పోసుకుంది. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. సీమెన్స్ కంపెనీలోని వ్యక్తితో లాలూచీ పడ్డారు. 90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సీమెన్స్ సుమారు రూ.3 వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారు. ఒక కంపెనీ ఎక్కడైనా రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా?

ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ కూడా చేయించలేదు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుంటే ఒక్కరూ మాట్లాడలేదు. కారణం ఒక్కటే.. డి.పి.టి అని నేను ఇంతకుముందు కూడా పబ్లిక్ మీటింగులలో చెబుతుంటాను. డి అంటే దోచుకో, పి అంటే పంచుకో, టి అంటే తినుకో అని అర్థం. ఇదీ వాళ్ల విధానం. ఎవడూ అడగడు, ఎవడూ రాయడు, ఎవడూ చూపడు.. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు.

ఈ స్కాంను మించిన అవినీతి ఎక్కడా చూడం. క్యాబినెట్ లో నిర్ణయించినమేరకు జీవో ఇచ్చారు. అయితే జీవోలో ఒకలాగా ఉంటే, ఒప్పందంలో మరొకలాగా ఉంటుంది. 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో క్లస్టర్ కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. జీవోకు, ఒప్పందానికి ఎక్కడా పొంతన లేదు. జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారు.

10 శాతం కాంట్రిబ్యూషన్ అనేది ఒప్పందంలోకి వచ్చేసరికి ఎగిరిపోయింది. ఆర్థికసాయం కింద రూ.330 కోట్లు ఇచ్చేట్టు మార్పులు చేశారు. స్కాంకు ఇక్కడ బీజం పడింది. ఆ తర్వాత 3 నెలల కాలంలో 5 దఫాలుగా రూ.371 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కాం జరుగుతుందా?

జీవో ఒకలా ఉంది, ఎంవోయూ మరోలా ఉంది.. సంతకాలు ఎలా చేశారో చెప్పాలి. తీగ లాగితే డొంక కదిలింది. దీనిపై సీమెన్స్ సంస్థ కూడా అంతర్గత దర్యాప్తు జరిపింది. ప్రభుత్వ జీవోతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ చెప్పింది" అని సీఎం జగన్ వివరించారు.





Untitled Document
Advertisements