అడ్వొకేట్ రాకేష్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత భేటీ.. గంటల తరబడి ఈడీ విచారణ పై ఆరా

     Written by : smtv Desk | Tue, Mar 21, 2023, 11:15 AM

 అడ్వొకేట్ రాకేష్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత భేటీ.. గంటల తరబడి ఈడీ విచారణ పై ఆరా

తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం లిక్కర్ స్కాం లో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు కవితను విచారించడం జరిగింది. ఈ నేపధ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై సుప్రీంకోర్టు అడ్వొకేట్ రాకేష్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత మంగళవారం సంప్రదింపులు జరిపారు. ఉదయం రాకేష్ చౌదరి ఆఫీసుకు వెళ్లిన కవిత.. ఆయనతో భేటీ అయ్యారు. అధికారుల విచారణ తీరును వివరించి న్యాయ సలహా కోరారు. అనుమానితురాలిగా పిలిచి గంటలకు గంటలు విచారణ చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఓ మహిళను ఇలా గంటల తరబడి ఈడీ విచారిస్తే ఏమీ చేయలేమా అని అడిగినట్లు సమాచారం. రాకేష్ చౌదరితో భేటీ తర్వాత ఎమ్మెల్సీ కవిత తిరిగి కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. మరికాసేపట్లో కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరనున్నారు.

సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 వరకు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం ఉదయం మరోమారు విచారణకు రమ్మంటూ ఎమ్మెల్సీకి అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత న్యాయ సలహా కోసం సుప్రీంకోర్టు అడ్వొకేట్ తో సమావేశమయ్యారు. మంగళవారం విచారణ మొత్తం కవిత మొబైల్ ఫోన్లపైనే కేంద్రీకృతం కానుందని తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లను మార్చారని, మార్చేసిన ఫోన్లను ధ్వంసం చేశారని అధికారులు మొదటినుంచి ఆరోపిస్తున్నారు. అయితే, ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణలను కవిత కొట్టిపారేశారు. ఫోన్లన్నీ ఉన్నాయని చెప్పారు. వాటన్నింటినీ ఈరోజు అధికారులకు చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.





Untitled Document
Advertisements