వినూత్న రీతిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసన తెలిపిన మహిళ!

     Written by : smtv Desk | Tue, May 23, 2023, 12:27 PM

వినూత్న రీతిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసన తెలిపిన మహిళ!

ఉక్రెయిన్ వంటి చిన్న దేశం పై రష్యా యుద్ధం చేయడం మొదలు పెట్టి ఏడాదికి పైగా గడుస్తుంది. యుద్ధం కారణంగా ఎంతో నష్టం వాటిల్లుతున్నప్పటికి రష్యా మాత్రం ఎంతకు వెనక్కి తగ్గడంలేదు. అదేవిధంగా దాడులతో తెగబడుతున్న రష్యా సేనలను ఉక్రెయిన్ దీటుగా నిలువరిస్తోంది. ఈ క్రమంలో ఇరు వైపులా భారీ నష్టం సంభవిస్తోంది. అయినప్పటికీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. రష్యా దురాక్రమణపై పలువురు అంతర్జాతీయ వేదికలపై గళం విప్పారు. తాజాగా, 76వ కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రక్తాన్ని పోలిన రంగును ఒంటిపై పూసుకున్న ఓ మహిళ రెడ్‌కార్పెట్‌పై నడిచి కలకలం రేపింది.

‘యాసిడ్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆదివారం చిత్ర బృందం రెడ్‌కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చింది. అదే సమయంలో ఉక్రెయిన్ జాతీయ జెండా రంగులైన నీలం, పసుపు రంగుల దుస్తులో వచ్చిన ఓ మహిళ ఫొటోలకు పోజిచ్చింది. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న ఎరుపు రంగును తలపై పోసుకుని శరీరమంతా రాసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఆ మహిళ ఎవరన్నదీ తెలియరాలేదు. అయితే, ఆమెను ఉక్రెయిన్ వాసిగా అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు నిరసనగానే ఆమె ఇలా చేసినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇలాగే ఓ మహిళ అనూహ్యంగా నిరసన తెలిపి కలకలం రేపింది.





Untitled Document
Advertisements