బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ కురిసే అవకాశం

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 03:00 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..  తెలుగు రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ కురిసే అవకాశం

రెండు తెలుగు రాష్ట్రాలలో గతకొద్ది రోజులుగా పెరిగిన ఎండల వేడిమి నుండి ఉపశమనం కలిగించేలా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల వర్షం కారణంగా నష్టాలు సైతం సంభవిస్తున్నాయి. అయితే తాజగా వాతావరణ శాఖ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.

Untitled Document
Advertisements