ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జీర్ణసమస్యలు వస్తాయట జాగ్రత్త!

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 04:07 PM

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే జీర్ణసమస్యలు వస్తాయట జాగ్రత్త!

అన్నేసి చూడు నన్నేసి చూడు అనే సామెత ఉప్పు గురించి చెప్పడానికి వాడుతుంటారు. ఎందుకంటే కూరల్లో ఏది తక్కువున్నా తినగలం.. కానీ, అదే ఉప్పు లేకున్నా లేదా కాస్త తగ్గినా తినడం కష్టమే. అలా అని ఎక్కువగా వేసుకున్నా తినలేము పైగా ఉప్పు మోతాదుకు మించి వాడడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బాడీలో ద్రవ సమతుల్యతని కాపాడుకోవాలంటే ఉప్పు అవసరం. ఇది నరాల పనితీరుకి కూడా అవసరం. అవసరం అన్నారు కదా అని ఉప్పు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయి. మరి ఆ సమస్యలేంటో చూద్దామా..

* ఎక్కువగా దాహం.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది బాడీలో డీహైడ్రేషన్‌కి కారణమవుతుంది. అధిక దాహాన్ని కలిగిస్తుంది. దీంతో నీరు ఎక్కువగా తీసుకుంటారు. శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది.
* వాపు.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బాడీలో నీరు నిలిచిపోతుంది. కాళ్ళు, పాదాలు, చేతుల్లో వాపు ఉంటుంది. రక్తనాళాల్లో అధిక సోడియం కంటెంట్ కారణంగా ఇది చుట్టుపక్కల కణజాలాల నుండి నీటిని గ్రహిస్తుంది. దీంతో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారంగా డాక్టర్‌ని కలవడం మంచిది.
* కిడ్నీ సమస్యలు.. ఉప్పు ఎక్కువగా తసీుకుంటే అది మూత్రపిండాల పనితీరుపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి కిడ్నీ సమస్యలకి దారితీస్తుంది. శరీరంలో సోడియం స్థాయిని కంట్రోల్ చేయడానికి కిడ్నీలు కీ రోల్ పోషిస్తాయి. రక్తంలోని ట్యాక్సిన్స్‌ని తొలగిస్తాయి. సోడియం లెవల్స్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలను దెబ్బతీసి మూత్రపిండాల్లో రాళ్ళు, ద్రవ అసమతుల్యతకి దారితీస్తుంది.
* జీర్ణ సమస్యలు.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బరం, గ్యాస్, కడుపులో ఇబ్బంది వంటి జీర్ణ సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి, భోజనం చేసిన తర్వాత జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* హైబీపి.. ఎక్కువ ఉప్పు తీసుకుంటే హైబీపి పెరుగుతుంది. ఉప్పులోని సోడియం శరీరం నీటిని ఆదాచేయడంతో పాటు రక్తపరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల హైబీపి, గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యలకి దారితీస్తుంది.

ఎంత తీసుకోవాలి.. శరీరానికి ఉప్పు అనేది తక్కువగానే అవసరం. ఎంత తీసుకోవాలనేది వయసు, లింగం, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా రోజుకి 2300 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. హైబీపి ఉంటే మోతాదుని మరింత తగ్గించాలి. అలాగే తరుచుగా డాక్టర్ ని కలిసి బీపీ చెక్ చేయించుకుంటూ అవసరమైన మందులను డాక్టర్ సూచన మేరకు వాడుకోవాలి.

Untitled Document
Advertisements