ఏ సీట్ లో కూర్చుంటే విమాన ప్రయాణంలో సురక్షితం?

     Written by : smtv Desk | Fri, Feb 10, 2023, 12:17 PM

ఏ సీట్ లో కూర్చుంటే విమాన ప్రయాణంలో సురక్షితం?

మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయనిస్తున్నాము అంటే విండో సీట్ లో కూర్చోవడానికి ఇష్టపడతాము. ఆ సీట్ కొరకు పక్కన కూర్చునేది మన వాళ్ళే అయినప్పుడు వారితో పోట్లడతాము కూడా.. అది కార్, బస్, ట్రైన్ లేదా విమానం ఏదైనా సరే విండో సీట్ కావాల్సిందే. అయితే, విమానంలో విండో సీటుకు డిమాండ్ ఎక్కువ.. ప్రయాణికులలో చాలామంది ముందుగా ఎంచుకునేది విండో సీటునే! అయితే, భధ్రతాపరంగా చూస్తే విండో సీటులో కూర్చోడం అంత క్షేమం కాదని నిపుణులు చెబుతున్నారు. మూడు సీట్లు ఉన్న వరుసలో అటు విండో సీటు, ఇటు చివరి సీటు కాకుండా మధ్యలో కూర్చుంటే ప్రమాదాలు జరిగినపుడు క్షేమంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

ఆస్ట్రేలియాలోని సెంట్రల్ క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి చెందిన విమానయాన నిపుణుడు ప్రొఫెసర్ డౌగ్ డ్రూరీ సూచనల ప్రకారం.. దురదృష్టవశాత్తూ విమానం ప్రమాదానికి గురైన సందర్భాలలో మిగతా సీట్లలో కూర్చున్న వారితో పోలిస్తే మధ్య సీటులో కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీనికి కారణం.. ప్రమాదం జరిగినపుడు విండో సీట్లో కూర్చున్న వారిపై బయటి నుంచి, చివరి (ఐల్) సీట్లో కూర్చున్న వారిపై విమానం లోపలి నుంచి ముందుగా ప్రభావం పడుతుంది.
విమానంలోని మధ్య సీట్లు అన్నింటికీ ఇది వర్తించదని ఆయన వివరించారు. విమానంలోని వెనక వరుసల్లోని మధ్య సీట్లలో కూర్చోవడం భద్రతాపరంగా మెరుగని సూచించారు. విమానం రెక్కల ప్రాంతంలో ఇంధనం ఉంటుందని, అందువల్ల ఆ ప్రాంతంలోని ఏ సీట్లలో కూర్చున్నా సేఫ్ కాదని డౌగ్ డ్రూరీ చెప్పారు. ఎమర్జెన్సీ డోర్ దగ్గర్లో కూర్చోవడం వల్ల ప్రమాదాలు జరిగినపుడు విమానంలో నుంచి తొందరగా బయటపడే వీలుంటుందని వివరించారు. ఇక విమానం ముందు వరుసల్లోని సీట్లతో పోలిస్తే వెనక వరుసల్లోని సీట్లే సేఫ్ అని ఆయన సూచించారు. మరి ఈ సారి మీరు విమాన ప్రయాణం చేసేతప్పుడు సీట్లు ఎంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తారు కదూ!





Untitled Document
Advertisements