శ్రీశైల క్షేత్రం పరిధిలో మే ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వస్తువుల వాడకం బ్యాన్

     Written by : smtv Desk | Thu, May 02, 2024, 12:16 PM

శ్రీశైల క్షేత్రం పరిధిలో మే ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వస్తువుల వాడకం బ్యాన్

ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హాని కలిగిస్తుంది అని తెలిసినప్పటికీ ప్లాస్టిక్ వాడకం ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల క్షేత్ర అధికారులు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి అంటే మే ఒకటో తేదీ నుంచి అధికారులు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.
అలాగే దైవ దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు.
ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు.
అలాగే ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జూట్‌ బ్యాగులు ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని స్థానికులు, వ్యాపారులు, హోటళ్లు, సత్రాల నిర్వాహకులను కోరారు.





Untitled Document
Advertisements