తమ సంస్థ ఉద్యోగిని అరుదైన గిఫ్ట్ తో ఆశ్చర్యపరచిన యాపిల్..

     Written by : smtv Desk | Fri, Feb 24, 2023, 01:33 PM

తమ సంస్థ ఉద్యోగిని అరుదైన గిఫ్ట్ తో ఆశ్చర్యపరచిన యాపిల్..

ప్రస్తుత కాలంలో ప్రముఖ టెక్ సంస్థలన్నీ కూడా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇళ్ళకు పంపుతుంటే యాపిల్ మాత్రం తనదైన పంథాలో వెళుతోంది. ఇప్పటివరకూ తమ సంస్థ నుండి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టని యాపిల్ తాజాగా ఓ ఉద్యోగికి ఊహించని బహుమతినిచ్చి ఆశ్చర్యపరిచింది. సంస్థలో ఆ ఉద్యోగి పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. అల్యూమినియంతో తయారు చేసిన ఓ స్మారక చిహ్నంతో పాటూ యాపిల్ పాలిషింగ్ వస్త్రం, ఉద్యోగికి ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ సీఈఓ స్వయంగా సంతకం చేసిన ప్రశంసాపత్రాన్ని అందించింది. సాధారణంగా యాపిల్ ఉద్యోగులకు క్రిస్టల్‌తో చేసిన బహుమతులను ఇస్తుంటుంది. దీంతో.. ఆ ఉద్యోగి తన గిఫ్ట్ చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
యాపిల్ మొదటి నుంచీ ఆచితూచి అడుగులు వేయడంతోనే ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రమాదం తప్పిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ సంక్షోభ సమయంలో ఇతర సంస్థలు పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకోగా యాపిల్ మాత్రం కార్యకలాపాల విస్తరణలో సంయమనం పాటించింది. ఇక మిగతా సంస్థల్లాగా యాపిల్ తన ఉద్యోగులకు అదనపు సౌకర్యాల కల్పన పేరిట వృథా ఖర్చులు పెట్టదు. అంతేకాకుండా.. సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన శాలరీలో ఏకంగా 50 శాతం మేర కోత విధించుకున్నారు. తన జీతం అధికంగా ఉందని భావించిన కుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. మొదటి నుండి కూడా ఆచి తూచి వ్యవహరిస్తూ వచ్చిన కారణంగానే యాపిల్ సంస్థ స్థిరంగా వ్య్వహరిస్తుందనేది స్పష్టంగా అర్ధం అవుతుంది.





Untitled Document
Advertisements