నా శవాన్ని మోసే వరకూ పార్టీ నడుపుతా...

     Written by : smtv Desk | Fri, Apr 05, 2019, 08:10 AM

 నా శవాన్ని మోసే వరకూ పార్టీ నడుపుతా...

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ..’నేనే బావుండాలి.. మిగతా వాళ్లంతా నాపై ఆధారపడాలి’ అనే ధోరణి వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిదని ధ్వజమెత్తారు. తనకు టీడీపీతో గానీ, వైసీపీతో గానీ వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. తనను సినీ నటుడని ఎద్దేవా చేసే జగన్‌.. సినీనటులను ఎందుకు తన పార్టీలో చేర్పించుకుంటున్నారని ప్రశ్నించారు. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో పవన్‌ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్‌కు దళితులపై ప్రేమ లేదని పవన్‌ విమర్శించారు. పులివెందులలో వైసీపీ నాయకుల ఇంటి ముందు నుంచి దళితులు వెళ్లాలంటే చెప్పులు చేత్తో పట్టుకొని వెళ్లే పరిస్థితి ఉందన్నారు. రెండేళ్లపాటు జైల్లో ఉన్న జగన్‌ అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావును ఓడించి గంట మోగకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఓ మంచి విషయం నేర్చుకున్నానని, ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించకుండా చక్కని పాలన అందించే పార్టీ బీఎస్పీ అని అన్నారు. విశాఖలో సమాజసేవకుల భూములు కబ్జాకు గురయ్యాయని, అధికారంలోకి వచ్చాక వారి భూములు కబ్జా చేసిన అక్రమార్కులను జైల్లో పెట్టించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

‘నేను ప్రజలను విలువైన మనుషులుగా చూస్తా. అంతేగానీ ఓటు కోణంలో చూడను. టీడీపీ, వైసీపీల్లో వారసత్వ అధికారం ఉంది. వారసత్వంగానే ఆ పార్టీ నేతలు ఇంత వారయ్యారు. కానీ జనసేన ఏ వారసత్వమూ లేకుండా జనంలోంచి పుట్టుకొచ్చింది. తొలుత నేను మోడీకి మద్దతు పలికిన మాట వాస్తవమే. పాలనలో మార్పు చూపిస్తారని ఆయన్ను నమ్మితే, చివరికి మోడీ కూడా అందరి లాంటి రాజకీయ నాయకుడయ్యారు. ఈ మధ్య ఓ జాతీయ మీడియా సంస్థ ఎన్నాళ్లు పార్టీ నడుపుతారు? అని అడిగింది. నా జనసైనికుల్లో నలుగురు నా శవాన్ని మోసే వరకూ పార్టీ నడుపుతానని చెప్పా’ అని పవన్‌ అన్నారు.





Untitled Document
Advertisements