రైతులను ఓట్లు అడిగే నైతికహక్కు లేదు

     Written by : smtv Desk | Fri, Apr 05, 2019, 06:19 PM

 రైతులను ఓట్లు అడిగే నైతికహక్కు లేదు

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌కు మద్దతుగా జగిత్యాలలో గురువారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించగలదని కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధి మధుయాష్కీకి ఓట్లేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. కేసీఆర్‌ రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లయితే నిజామాబాద్‌లో 176 మంది రైతులు నామినేషన్లు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు. తెరాస సిట్టింగ్ ఎంపీ కవిత నిజామాబాద్‌ రైతుల కోసం ఏమి చేశారో చెప్పాలని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆమెకు రైతులను ఓట్లు అడిగే నైతికహక్కు లేదని అన్నారు. ఆమెను ఓడిస్తేనే కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుందని అన్నారు.

15 మంది ఎంపీలున్నప్పటికీ విభజన చట్టంలో రాష్ట్రానికి న్యాయంగా రావలసినవి ఏవీ సాధించుకోలేకపోయిన తెరాసకు ఇప్పుడు 16 మంది ఎంపీలను ఇస్తే మాత్రం ఏమి చేయగలదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నరేంద్రమోడీని మళ్ళీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని జీవన్‌రెడ్డి అన్నారు. కనుక తెరాసకు ఓటు వేస్తే బిజెపికి ఓట్లు వేసినట్లేనని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి నెలకు రూ.6,000 చొప్పున చెల్లిస్తుందని రాహుల్ గాంధీయే స్వయంగా హామీ ఇచ్చేరు కనుక లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అభ్యర్ధులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని జీవన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





Untitled Document
Advertisements