స్వల్ప లాభాల్లో సెన్సెక్స్

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 11:26 AM

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నిలకడగా ముగిశాయి. అయితే సెన్సెక్స్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకోగా, నిఫ్టీ సూచీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉండిపోయింది. ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించి, ఇంట్రాడేలో 350 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, లోహ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు సానుకూలంగా మారాయి. అయితే చివరి అరగంటలో సూచీలు ఒక్కసారిగా డీలాపడ్డాయి.

కీలక రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీల పతనానికి కారణమైంది. ఊగిసలాటలో సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 39,113 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 11,691 వద్దే ముగిసింది. ప్రధానంగా టాటా స్టీల్, జి ఎంటర్‌టైన్‌మెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్‌టిపిసి, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, యుపిఎల్ లిమిటెడ్, అదానీ పోర్ట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.





Untitled Document
Advertisements