పీఎం కేర్స్‌ ఫండ్‌: రైల్వే ఉద్యోగుల ఒక్క రోజు జీతం విరాళం

     Written by : smtv Desk | Sun, Mar 29, 2020, 06:50 PM

పీఎం కేర్స్‌ ఫండ్‌: రైల్వే ఉద్యోగుల ఒక్క రోజు జీతం విరాళం

కరోనా వైరస్‌ (కోవిడ్ 19)పై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు, సెలబ్రిటీలు భారీగా విరాళాలు అందించగా తాజాగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ సంస్థ రైల్వే శాఖ భూరి విరాళం ప్రకటించింది. రైల్వే ఉద్యోగులు తమ ఒక్క రోజు జీతం రూ. 151 కోట్లు పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళమిచ్చారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

‘ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నేను, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగాడిల నెల జీతం, అలాగే 13 లక్షల మంది రైల్వే, పీఎస్‌యూ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతానాన్ని విరాళంగా ఇస్తున్నాం. మొత్తం రూ. 151 కోట్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందజేస్తాం’ అని పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు.

అలాగే ఇలాంటి క్లిష్ల సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన సహచర ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. మన దేశం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తామంతా ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. కాగా, పీఎం కేర్స్‌ ఫండ్‌కు ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉండగా, రక్షణశాఖ, ఆర్థిక, హోం శాఖ మంత్రులు సభ్యులుగా ఉన్నారు.






Untitled Document
Advertisements