2019 వన్డే ప్రపంచకప్: అంబటి రాయుడి వేటుపై అసలు కారణం వెలుగులోకి..!

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 09:29 AM

2019 వన్డే ప్రపంచకప్: అంబటి రాయుడి వేటుపై అసలు కారణం వెలుగులోకి..!

ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్ జట్టులోకి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడ్ని ఎంపిక చేయకపోవడానికి అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2018 ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారించిన అంబటి రాయుడు.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి.. నెం.4లో నమ్మదగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2017లో భారత్ జట్టుకి యువరాజ్ సింగ్ దూరమైన అతని స్థానంలో చాలా మంది ఆటగాళ్లని పరీక్షించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ఆఖరిగా అంబటి రాయుడు ఆ స్థానానికి అర్హుడిగా గుర్తించి వరుస అవకాశాలిచ్చింది. కానీ.. 2019 వన్డే ప్రపంచకప్ ముంగిట భారత సెలక్టర్లు.. రాయుడికి ఊహించని షాకిచ్చారు.

భారత వన్డే జట్టులో దొరికిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్న రాయుడు.. ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సత్తాచాటి.. వన్డే ప్రపంచకప్‌ రేసులో నిలిచాడు. ఈ తెలుగు క్రికెటర్‌కి టీమ్‌లో నెం.4 స్థానం గ్యారెంటీ అని కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అభిప్రాయపడ్డాడు. కానీ.. వన్డే ప్రపంచకప్ ముంగిట పరిస్థితులు మారిపోయాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రాయుడు తడబడగానే సెలక్టర్లు మాట మార్చేశారు. వన్డే ప్రపంచకప్‌కి నెం.4 స్థానంలో రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. దానికి అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన కారణం.. రాయుడితో పోలిస్తే.. విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో టీమ్‌కి ఉపయోగపడతాడని. దాంతో.. చిరెత్రిపోయిన రాయుడు.. 3D కళ్లద్దాలకి ఆర్డర్‌ ఇచ్చినట్లు ట్వీట్ చేసి సెలక్టర్ల ఆగ్రహానికి గురయ్యాడు. వన్డే ప్రపంచకప్‌ సమయంలో శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయపడినా.. రాయుడికి మాత్రం అవకాశం దక్కలేదు.
వన్డే ప్రపంచకప్‌కి అంబటి రాయుడ్ని ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా స్పోర్ట్స్‌క్రీడాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సెలక్టర్ గగన్ ఖోడా వెల్లడించాడు. ‘‘అంబటి రాయుడు అనుభవజ్ఞుడు కావడంతో ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతడ్ని ఉంచి.. దాదాపు ఏడాదిపాటు అవకాశాలిచ్చాం. కానీ.. అతను టోర్నీ దగ్గరపడేకొద్దీ స్తబ్దుగా మారుతున్నట్లు గ్రహించాం. ఆఖరికి అతనిలో ప్రపంచకప్‌ లాంటి మెగాటోర్నీలో ఆడే ఆత్మవిశ్వాసం కనిపించలేదు’’ అని గగన్ ఖోడా వెల్లడించాడు.





Untitled Document
Advertisements