ఇంటర్‌లో విద్యార్థిగా చేరిన విద్యా శాఖ మంత్రి!

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 07:11 PM

ఇంటర్‌లో విద్యార్థిగా చేరిన విద్యా శాఖ మంత్రి!

స్వాతంత్ర్య భారత దేశంలో.. పదో తరగతి కూడా పాస్ కాని వ్యక్తులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. ఉన్నత చదువులు చదివినవాళ్లు మాత్రం కూలీలవుతారు. అక్షరం ముక్క కూడా రానివాడు, విద్యా శాఖను ఏలుతాడు. మరి, చదువురాని వాడికి చదువు విలువ తెలుసనే ఆ శాఖ బాధ్యతలు అప్పగిస్తారా? లేదా.. ఇంకేమైనా ఒత్తిళ్ల వల్లా అనేది ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.


జార్ఖండ్‌లో జరిగింది కూడా ఇదే. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన జాగర్నాత్ మహతోకు ఏకంగా విద్యా శాఖను అప్పగించారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజలు ఊరుకుంటారా? విద్య రానివాడికి విద్యా శాఖను ఇవ్వడమేంటీ? ఇక రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు నాశనమైనట్లేనని విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా సైతం జార్ఖండ్ ప్రభుత్వ పెద్దలను ఏకి పారేసింది.


ఈ విమర్శలు మహతోను బాగా బాధించాయట. దీంతో చదువుకు మంగళం చెప్పిన పాతికేళ్ల తర్వాత మళ్లీ ఆయన కాలేజీలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నారు. పదకొండో తరగతి(మనకు ఇంటర్)లో జాయిన్ అయ్యారు. 53 ఏళ్ల మహతో ఇప్పుడు మంత్రిగానే కాదు.. మంచి విద్యార్థిగా కూడా రాణించాలని కంకణం కట్టుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యా మంత్రిగా నా బాధ్యతలు నిర్వహిస్తూనే.. నా చదవును కొనసాగిస్తా. నేను రాజకీయ నాయకుడిని. కాబట్టి, ఇంటర్‌లో పొలిటికల్ సైన్స్‌ను సబ్జెట్‌గా ఎంచుకున్నా. మిగతా సబ్జెక్టులు గురించి త్వరలోనే చెబుతా’’ అని తెలిపాడు.


కరోనా టైమ్‌లో.. కాలేజీలు మూసేసినా.. ఆయన ఎంతో చిత్తశుద్ధితో అడ్మిషన్ పొందారంటూ.. కొందరు వ్యంగ్య బాణాలు వేయడం మొదలుపెట్టారు. ఇదంతా విమర్శలను కవరింగ్ చేసుకోడానికి మంత్రిగారు ఆడుతున్న డ్రామా అని మరికొందరు అంటున్నారు.





Untitled Document
Advertisements