ఫిబ్రవరిలోనే ఐపీఎల్ 2021 మినీ వేలం

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:56 PM

ఫిబ్రవరిలోనే ఐపీఎల్ 2021 మినీ వేలం

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన మినీ వేలంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ధారణకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్ మార్చి - మే నెల మధ్యలో జరిగే సూచనలు కనిపిస్తుండటంతో.. ఫిబ్రవరిలోనే మినీ వేలం నిర్వహింబోతున్నారు. ఈ మేరకు తేదీపై కూడా చర్చ జరిగిందని.. అలానే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలని కూడా అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలానికి విడిచి పెట్టే ఆటగాళ్ల జాబితాని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిట్లు తెలుస్తోంది.

మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించగా.. జనవరి 21లోపు టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని అందజేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఐపీఎల్ 2021 సీజన్‌ని భారత్‌లోనే నిర్వహించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే.

జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభంకానుండగా.. భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తదితరు ఈ టోర్నీలో ఆడబోతున్నారు. అంతేకాకుండా ఈ టోర్నీలో కొంత మంది యువ క్రికెటర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. మినీ వేలాన్ని ఈ టోర్నీ తర్వాత నిర్వహిస్తే..? బాగుంటుందని కౌన్సిల్ భావిస్తోంది. ఈ నెల 11న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుండగా.. ఈ మీటింగ్ తర్వాత అధికారికంగా తేదీలను ప్రకటించనున్నారు.





Untitled Document
Advertisements