చిన్నకూతురి పెళ్ళికి దాచిన నగలు కాజేసిన పెద్దకుతురు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లి

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 08:28 AM

చిన్నకూతురి పెళ్ళికి దాచిన నగలు కాజేసిన పెద్దకుతురు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లి

ఎక్కడనైన ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకరికొకరు తోడుగా, ఎంతో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల మధ్య ఉండే ప్రేమానురాగాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించింది ఓ అక్క. తల్లికి తనకంటే చెల్లే ఎక్కువ ఇష్టమని కోపం పెంచుకున్న ఓ యువతి చివరకు తల్లి ఇంట్లోనే చోరీకి పాల్పడింది. చెల్లి పెళ్లికని ఇంట్లో దాచిన లక్షల విలువైన నగలు, నగదు దొంగిలించింది. ఢిల్లీలో జనవరి 30న ఈ ఘటన జరగ్గా పోలీసులు తాజాగా నిందితురాలితో నిజం కక్కించారు.

ఉత్తమ్‌నగర్‌లోని సేవక్ పార్క్ ప్రాంతంలో కమ్లేశ్ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటోంది. ఇటీవలే పెద్ద కూతురు మరో ఇంటికి మారింది. కాగా, జనవరి 30న తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలు, రూ.25 వేల నగదు చోరీ అయినట్టు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. తాళాలు గట్రా యథాతథంగా ఉండటంతో వారు స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో ఓ మహిళ బుర్ఖా ధరించి కమ్లేశ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. చివరకు పోలీసులు బుర్ఖాలోని మహిళను కమ్లేశ్ పెద్ద కూతురు శ్వేతగా గుర్తించారు.

శ్వేతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తల్లికి తనకంటే చెల్లెలిపైనే ఎక్కువ ఇష్టం ఉండటం తనకు ఆగ్రహం కలిగించిందని తెలిపింది. అంతేకాకుండా, తనకు అప్పులు కూడా ఉండటంతో వాటిని తీర్చేందుకు చోరీ చేశానని పేర్కొంది. దొంగతనానికి కొన్ని రోజుల ముందే ఆమె పథకం ప్రకారం, మరో ఇంటికి మారిపోయింది. కొత్త ఇంట్లో కూతురు సెటిలయ్యేందుకు తల్లి కమ్లేశ్ పలు ఏర్పాట్లు చేసింది. చిన్న కూతురు ఆఫీసుకు వెళ్లాక పెద్ద కూతురు ఇంటికి వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో ఓ రోజు తన ఇంటికొచ్చిన తల్లి నుంచి శ్వేత ఇల్లు, కప్‌బోర్డు తాళాలు దొంగిలించింది. ఆ తరువాత కూరగాయలు కొనేందుకని చెప్పి బయటకు వచ్చిన ఆమె ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో బుర్ఖా ధరించి తల్లి ఇంటికెళ్లి నగలు దొంగిలించింది. నగలు, డబ్బులు పోయాయని ఆ తరువాత తల్లి తనకు చెప్పినా శ్వేత ఏమీ తెలీనట్టు నటించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు. కూతురు చేసిన పని తెలిసిన తల్లి అవాక్కయింది.





Untitled Document
Advertisements