యూపీఏ హయాంలో ఆర్థిక దుర్వినియోగానికి సోనియాగాంధీ నాయకత్వమే కారణం.. నిర్మలా సీతారామన్

     Written by : smtv Desk | Sat, Feb 10, 2024, 09:27 AM

యూపీఏ హయాంలో ఆర్థిక దుర్వినియోగానికి  సోనియాగాంధీ నాయకత్వమే కారణం.. నిర్మలా సీతారామన్

ఈసారి కేంద్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతూ అన్ని పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడి అధికార బీజేపీ పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ ‘సూపర్‌ ప్రైమ్‌మినిస్టర్‌’గా వ్యవహరించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగం, అసంబద్ధ నిర్వహణకు సోనియాగాంధీ నాయకత్వమే ప్రధాన కారణమని ఆరోపించారు.
యూపీఏ హయాంలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందంటూ లోక్‌సభలో ‘శ్వేతపత్రం’ విడుదల సందర్భంగా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘ యూపీఏలో దుర్వినియోగం జరిగింది. 10 ఏళ్ల యూపీఏ పాలనలో అవినీతి, ఆర్థిక వ్యవస్థ దుర్వినియోగానికి ప్రభుత్వ నాయకత్వమే ప్రధాన కారణం. యూపీఏ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేకపోవడం, నాయకత్వం లేకపోవడమే ప్రధాన సమస్య. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎన్ఏసీ) చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీ 'సూపర్ ప్రైమ్ మినిస్టర్'గా వ్యవహరించారు. ఎన్ఏసీకి జవాబుదారీతనం లేదు. రాజ్యాంగబద్ధమైన అధికారులు లేవు. అటువంటి జవాబుదారీతనం లేని, సమాధానం చెప్పాల్సిన అవసరంలేని సంస్థ ఆమోదం కోసం ఫైల్స్ ఎందుకు వెళ్లాయి?’’ అని సీతారామన్ ప్రశ్నించారు.

కాగా తాము విడుదల చేసిన శ్వేతపత్రం సత్యాలతో కూడిదని, ఇందులో ఎలాంటి నిరాధార ఆరోపణలు లేవని ఆమె అన్నారు. శ్వేతపత్రంలో పేర్కొన్నవన్నీ సాక్ష్యాధారాల ఆధారంగానే ఉన్నాయని సీతారామన్ చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఆర్డినెన్స్‌ను చించివేశారని, ఈ చర్య దేశ ప్రధానిని అవమానించడం కాదా అని సీతారామన్ ప్రశ్నించారు.





Untitled Document
Advertisements