పెంపుడు కుక్కకు ఆరోగ్యం కొరకు మొక్కు.. మేడారం జాతరలో తులాభారం సమర్పణ!

     Written by : smtv Desk | Sat, Feb 10, 2024, 12:36 PM

పెంపుడు కుక్కకు ఆరోగ్యం కొరకు మొక్కు.. మేడారం జాతరలో తులాభారం సమర్పణ!

ఇంట్లో ఎవరికైనా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే దేవుడికి ముడుపు కట్టి మొక్కుకోవడం అనేది మనకు తెలిసిన విషయమే. అదే విధంగా భక్తులు మేడారం వనదేవతలను కోరిన కోరికలు నెరవేరిస్తే భంగారం సమర్పిస్తాము తల్లి అని వేడుకుంటారు. వారి కోరికలు నెరవేరితే మొక్కిన ప్రకారం భక్తులు బంగారం (బెల్లం) తో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
అయితే ఎవరైనా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమో, కష్టాలు తొలగాలనో కోరుకుంటూ భక్తులు మొక్కుకుంటారు. మేడారం జాతరలో ఆ మొక్కులు తీర్చుకుంటారు. హనుమకొండకు చెందిన బిక్షపతి, జ్యోతి దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం కోసం మొక్కుకున్నారు. జాతర సందర్భంగా ఆ మొక్కు తీర్చుకున్నారు. పెంపుడు కుక్కకు తులాభారం వేసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఈ తులాభారం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిక్షపతి, జ్యోతి దంపతులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్క ‘లియో’ గతేడాది అనారోగ్యం పాలైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిండి కూడా మానేసింది. వైద్యులకు చూపించినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం సమ్మక్క సారలమ్మకు మొక్కుకుంది. లియో ఆరోగ్యం కుదుటపడితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్నట్లు జ్యోతి చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకు లియో ఆరోగ్యం కుదుటపడిందని, లేచి తిరగడం మొదలు పెట్టిందని వివరించారు. దీంతో ఈ జాతర సందర్భంగా మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. వీడియో చూసిన కొందరు మూగజీవి పై అంత ప్రేమ పెంచుకున్న దంపతులకు హ్యాట్సాఫ్ అంటుంటే, మరి కొంతమంది ఇదెక్కడి విచిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంకా కొంతమంది అంతా తల్లి మహత్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://youtu.be/OSTbCVbFrUg?si=lqU43n_yXwivaG00





Untitled Document
Advertisements