ఫ్రీ కరెంట్ కావాలి అంటే ఆధార్ తప్పనిసరి.. తెలంగాణ ఇంధన శాఖ గెజిట్

     Written by : smtv Desk | Sat, Feb 17, 2024, 09:01 AM

ఫ్రీ కరెంట్ కావాలి అంటే ఆధార్ తప్పనిసరి.. తెలంగాణ ఇంధన శాఖ గెజిట్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల జాబితాలో ఉచిత విద్యుత్ పథకం ఒకటి. ఇప్పుడు ఆ పథకాన్ని అమలు పరిచే దిశగా పనిచేస్తున్న రేవంత్ ప్రభుత్వం కొన్ని నిబంధనలను జారీ చేసింది. ఉచిత విద్యుత్ పథకం ‘గృహజ్యోతి’ లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే గృహజ్యోతి పథకంలో పేర్లు నమోదవుతాయని పేర్కొంది.

ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని, ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులు వినియోగించవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవాలి.

బయోమెట్రిక్ ధ్రువీకరణలో భాగంగా వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలని ఇంధనశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. డిస్కంలే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను ఇంధన్ శాఖ ఆదేశించింది. దీంతో, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంధన శాఖ అధికారులు ఈ విషయం పై కసరత్తులు కొనసాగిస్తున్నారు.





Untitled Document
Advertisements