మేడారం భక్తులకు కేంద్రం కీలక ప్రకటన.. జాతరకు ప్రత్యేక రైళ్లు

     Written by : smtv Desk | Sat, Feb 17, 2024, 04:36 PM

మేడారం భక్తులకు కేంద్రం కీలక ప్రకటన..  జాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే వనదేవతల జాతరకున్న ప్రత్యేకత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఏడు మేడారం సమ్మక్క - సారక్క జాతర కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభం కానున్న జాతర కోసం భక్తులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. మేడారం జాతరకు వెళ్లనున్న భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు వెల్లడించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమానికి పాటుపడతామని ఆయన అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం రూ.3 కోట్లు అందించనుందని వెల్లడించారు.

07017/07018: సిర్పూర్ కాగజ్‌నగర్ - వరంగల్ - సిర్పూర్ కాగజ్‌నగర్, 07014/07015: వరంగల్ - సికింద్రాబాద్ - వరంగల్, 07019/0720: నిజామాబాద్ - వరంగల్ - నిజామాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరుతో పాటు పలు కీలకమైన స్టేషన్లలో ఆగనున్నాయి. కాగా తెలంగాణలోని ములుగు జిల్లా పరిధిలో వన దేవతలు సమ్మక్క సారక్కల జాతర జరుగుతుంది. పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు ఉపయోగపడే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements