సింగరేణిలో కారుణ్య నియామకాలు.. 1000 మందికి అవకాశం.. భట్టి విక్రమార్క

     Written by : smtv Desk | Wed, Feb 21, 2024, 07:39 PM

సింగరేణిలో కారుణ్య నియామకాలు.. 1000 మందికి అవకాశం.. భట్టి విక్రమార్క

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ను సింగరేణిలో ఉద్యోగ నియామకాల కొరకు 485 పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలంటూ ఆదేశించారు. ఇందులో 168 పోస్టులు అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

ఈ ఏడాది 1000 మందికి సింగరేణిలో కారుణ్య నియామకాలు కల్పిస్తామని తెలిపారు. వారసులకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో పాటు, సింగరేణి సిబ్బంది వ్యవహారాల డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళాలో ఇచ్చిన హామీల అమలుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

కారుణ్య నియామకాల్లో వారసుల వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. బొగ్గు గనుల్లో పని ఎంతో ప్రమాదకరం అని, 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులకు ప్రమాద బీమా అందించడం వల్ల వారికి కుటుంబాలకు ఆర్థిక భద్రత ఏర్పడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కోటి రూపాయల ప్రమాద బీమాపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు.

దీనిపై సింగరేణి సీఎండీ బలరాం నాయక్ స్పందిస్తూ.. ఇప్పటివరకు ఇలాంటి బీమా కోల్ ఇండియా సంస్థలోనూ లేదని తెలిపారు. సింగరేణి కార్మిలకు ప్రమాద బీమాపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మిగతా బ్యాంకులతోనూ ఒప్పందాలకు ప్రయత్నిస్తామని అన్నారు.





Untitled Document
Advertisements