అలసత్వం ప్రదర్శిస్తే అభ్యర్థుల్ని మార్చేందుకు వెనకాడను.. చంద్రబాబు

     Written by : smtv Desk | Mon, Feb 26, 2024, 07:41 AM

అలసత్వం ప్రదర్శిస్తే అభ్యర్థుల్ని మార్చేందుకు వెనకాడను.. చంద్రబాబు

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. టికెట్లు దక్కాయనే అలసత్వం వద్దని, ఎన్నికల్లో గెలుపు కోసం వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని సూచించారు. పనితీరు బాగాలేదని తేలితే అభ్యర్థుల్ని మార్చుతానని, ఈ విషయంలో వెనుకడుగు వేయబోనని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల వరకు ప్రతివారం సర్వే చేయిస్తానని అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఈ మేరకు తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టికెట్లు పొందినవారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఒక్క పొరపాటు కూడా జరగకూడదు
వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో ఒక్క పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని అభ్యర్థులను చంద్రబాబు హెచ్చరించారు. ఒక్క సీటు కూడా ఓడిపోకూడదని అన్నారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే అభ్యర్థులే స్వయంగా ఒకటికి పదిసార్లు వెళ్లి కలవాలని, అభ్యర్థిననే అహంకారంతో ఉండొద్దని సూచించారు. పోటీ చేసేది ఎంత సీనియర్‌ నాయకుడైనా, నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు కష్టపడాలని చంద్రబాబు సూచించారు. తటస్థులనూ కలవాలన్నారు. టీడీపీ - జనసేన పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే నూటికి నూరు శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

కుట్రలకు సిద్ధంగా ఉండాలి
ఎన్నికల్లో ఊహించని రీతిలో కుట్రలు, కుతంత్రాలు చేస్తారని. వాటన్నింటికీ సిద్దంగా ఉండాలని అభ్యర్థులకు చంద్రబాబు సూచించారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రణాళిక రూపొందించుకోవాలని వివరించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.3 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించామని, సర్వేలు పరిశీలించాక సుదీర్ఘ కసరత్తు తర్వాతే అభ్యర్థుల్ని ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ-జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయని ఆయన స్పష్టత ఇచ్చారు. కనుక పార్టీ శ్రేణులు ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగేస్తూ గెలుపు కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements