జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని ఖండించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి పై ఫైర్

     Written by : smtv Desk | Mon, Feb 26, 2024, 07:53 AM

జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని ఖండించిన కేటీఆర్..   రేవంత్ రెడ్డి పై  ఫైర్

తాజగా జర్నలిస్ట్ శంకర్ పై హైదరాబాద్ ఎల్బీ నగర్ పీఎస్ పరిధిలో మూకుమ్మడి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నిర్భయంగా నిజాలు చెబుతూ, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూ గళం వినిపిస్తున్న జర్నలిస్టు సోదరుడు శంకర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

కొడంగల్ అంశాలపైనా, కొడంగల్ రైతులకు జరుగుతున్న అన్యాయాలపైనా శంకర్ నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించారు. జర్నలిస్ట్ శంకర్ కు ఏం జరిగినా అందుకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

హస్తినాపురం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొందరు కాంగ్రెస్ నేతలు పక్కా ప్రణాళికతో రెక్కీ చేసి మరీ ఈ దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఘటనలో అమ్మాయిలను అడ్డంపెట్టుకుని శంకర్ హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.

హత్యాయత్నం నుంచి కాపాడాల్సిన పోలీసులే కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇది హత్యాయత్నమే కాదని, 307 సెక్షన్ పెట్టకుండా ప్రభుత్వానికి తొత్తులుగా మారి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రజా కోర్టులో దోషులు దొరికిపోయారని, సీసీ టీవీ ఆధారాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.

జర్నలిస్ట్ శంకర్ కు న్యాయం జరిగే వరకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఒక శంకర్ ను నోరుమూపిస్తాం అనుకుంటే వందల మంది శంకర్ లు తయారవుతారని హెచ్చరించారు. తాము పదేళ్ల పాటు పాలించామని, నాడు కేసీఆర్ పై ఎవరు మాట్లాడినా అధికారంతో అణచివేసే ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ చాలామందికి గొంతుక ఉండేది కాదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో అన్ని రకాల వాదనలకు అవకాశం ఉండాలని, అన్ని వాదనలు విని ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి రాజ్యహింసను, భౌతికదాడులను తాము ఎప్పుడూ ప్రోత్సహించలేదని అన్నారు. ఎక్కడన్నా తప్పు జరిగినా నివారించే ప్రయత్నం చేశామని వెల్లడించారు.

"జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది వరకు మీరు చాలా మాట్లాడారు. నియంత పాలన అనీ, అదనీ, ఇదనీ చాలా మాట్లాడారు. ఇప్పుడు మీ సాటి జర్నలిస్ట్ పై హత్యాయత్నం జరిగితే ఏ జర్నలిస్ట్ సంఘం కూడా బయటికి వచ్చి ఖండించిన పాపాన పోలేదు. ఇవాళ శంకర్ పై జరిగింది రేపు మీపై జరగొచ్చు.. మరోసారి చెబుతున్నా.. శంకర్ కు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత" అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కేటిఆర్ చేసిన ఈ వాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడాలి.





Untitled Document
Advertisements