కేంద్రం జగన్‌ను, కేజ్రీవాల్‌ను ఎందుకు వేరుగా చూస్తుంది.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

     Written by : smtv Desk | Thu, Feb 29, 2024, 08:56 AM

కేంద్రం జగన్‌ను,  కేజ్రీవాల్‌ను ఎందుకు వేరుగా చూస్తుంది..  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ప్రధాని మోదీ పై మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకునిఇతర రాజకీయ పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో ముచ్చటించిన నారాయణ ఈ విధమైన వాఖ్యలు చేశారు. .

రూ.100 కోట్ల కుంభకోణం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రూ.45 వేల కోట్ల అవినీతి కేసులను ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్‌‌మోహన్ రెడ్డిని మాత్రం ఏమీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి 10 ఏళ్లుగా బెయిల్‌పై బయట ఉండటం ఇదే తొలిసారని అన్నారు. మోదీ, షాలకు జగన్ మోకరిల్లడమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రస్తుతం సెక్షన్ - 17ఏను అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

విభజన చట్టంలోని హామీలను పక్కనపెట్టిన కేంద్రాన్ని ఏపీ పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించే ధైర్యం చేయట్లేదని నారాయణ ఆరోపించారు. తిరుపతి విశాఖపట్నం, అమరావతిల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి సంయుక్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టుగా ఈ సందర్భంలో పేర్కొన్నారు.






Untitled Document
Advertisements