జగన్ సహకారంతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రారంభమయింది.. బీవీ రాఘవులు

     Written by : smtv Desk | Thu, May 09, 2024, 12:51 PM

జగన్ సహకారంతోనే  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రారంభమయింది.. బీవీ రాఘవులు

ఏపీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసాయి. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ప్రచారంలో భాగంగా ప్రత్యర్ది పార్టీల నేతల పై విమర్శలు గుప్పించడంలో బిజీగా మారిపోయారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగనే కారణమని... ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమయిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తానని జగన్ చెప్పడం... ప్లాంట్ కార్మికులను, ప్రజలను ఎగతాళి చేయడమేనని అన్నారు.

రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల ఉద్యమాన్ని జగన్ కిరాతకంగా అణచివేశారని... ఉద్యమాలు చేస్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం వంటివి చేశారని రాఘవులు మండిపడ్డారు. కపట నాటకాలు ఆడుతున్న జగన్ ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మి... అదానీకి అప్పజెప్పింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. పదేళ్ల కాలంలో అదానీ ఆస్తులు రూ. 60 వేల నుంచి రూ. 16 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. ఇతంతా ప్రజలను కొల్లగొట్టి సంపాదించిందేనని ఆరోపించారు.





Untitled Document
Advertisements