మళ్లీ తెరపైకి స్వలింగ సంపర్క వివాదం..

     Written by : smtv Desk | Thu, May 17, 2018, 05:11 PM

 మళ్లీ తెరపైకి స్వలింగ సంపర్క వివాదం..

న్యూఢిల్లీ, మే 17 : స్వలింగ సంపర్క వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్‌జీబీటీ( లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు అయ్యింది. దీనిని గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే తదుపరి వాదనల తేదీ ఎప్పుడన్నది బెంచ్‌ వెల్లడించలేదు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ సెక్షన్‌ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్‌ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పక్కన పెట్టశాయి. 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్‌ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే 2013, డిసెంబర్‌ 11న హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. తన నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్లను 2014, జనవరి 28న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా.. సెక్షన్‌ 377 జోలికి మాత్రం ప్రభుత్వాలు పోలేదు.

Untitled Document
Advertisements