నేడు రాష్ట్ర కేబినెట్ కీలక భేటీ, నీళ్లు, నిధులే అజెండా?

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:03 AM

బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లోసిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్ శాఖ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కెసిఆర్‌సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో అందడంలేదని సమావేశంలో శాఖల వారీగా సిఎం కెసిఆర్ వివరించే అవకాశముందని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే ఆయన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల సిఎం నిర్వహించిన సమీక్షలో ఇరిగేషన్‌కు సంబంధించి కొత్తపనులు చేపట్టాలని నిర్ణయించారు.వాటిల్లో ప్రధానంగా దుమ్ముగూడెం వద్ద 37 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోస్తున్న నేపథ్యంలో మొత్తం మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని సిఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా చేపట్టనున్నారు. మొత్తం పనులకు రూ. 14వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇక కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రివర్గం ఆమోదం పొందితే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే ఆర్‌టిసికి సంబంధించి కార్మికుల విషయంలో సిఎం కెసిఆర్ కొన్ని హామీలు ఇచ్చారు. వాటిపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.





Untitled Document
Advertisements