కరోనా ఎఫెక్ట్: ఐటీలో ఆరు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఊడతాయ్!

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 12:17 PM

కరోనా ఎఫెక్ట్: ఐటీలో ఆరు నెలల్లో లక్షన్నర ఉద్యోగాలు ఊడతాయ్!

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలపై ఆర్దిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అన్ని రంగాలు స్తంభించిపోవడంతో ఇవి ఎప్పటికి కోలుకుంటాయో తెలియని పరిస్థితి. ఇక, కరోనా దెబ్బకు సాఫ్ట్‌వేర్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఉద్యోగాలలో భారీగా కోతపడనుంది. కొందరికి ఇప్పటికే పింక్ స్లిప్‌లను కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సిద్ధంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దేశంలోని చిన్న చిన్న ఐటీ కంపెనీలు ఉద్యోగులతో బలవంతంగా రిజైన్ చేయిస్తున్నాయి. కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు కొద్ది నెలల కిందటే కొత్తగా చేరినవారికి అవసరం లేదని సంస్థలు సమాచారం ఇస్తున్నాయి. కొన్ని సంస్థల్లో నియామకాలను రద్దు చేస్తుండగా, మరొకొన్ని చోట్ల వాయిదా పడే సూచనలు కనపిస్తున్నాయి. వారందరూ జూన్‌ చివరి నుంచి ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. ఇప్పుడు కరోనా ప్రభావంతో విదేశాల నుంచి ప్రాజెక్టులు ఆగిపోయే సంకేతాలు వెలువడటంతో ఉద్యోగాలు దక్కుతాయా?లేదా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని మానవవనరుల విభాగం నిపుణులు పేర్కొంటున్నారు. వీరంతా క్లయింట్‌లపై ఆధారపడే చిన్న చిన్న ఐటీ సంస్థల్లో పనిచేసేవారని ఓ నిపుణుడు వెల్లడించారు. అలాగే, పెద్ద, మధ్యతరహా ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగ నియమాకాల విషయంలో కొంత విరామం పాటిస్తాయని తెలిపారు.

ఐటీ రంగంలో 40 నుంచి 50 లక్షల మంది ఉద్యోగులుండగా.. చిన్న సంస్థల్లోనే 10 నుంచి 12 లక్షల మంది ఉన్నారు. దేశంలోని ఐదు అతిపెద్ద ఐటీ కంపెనీల్లో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో గత జులై నుంచి డిసెంబరు వరకు ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు ళ్లి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. నైపుణ్యం ఉన్న వారికి పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి తీసుకున్నాయి. వారిని వచ్చే జూన్‌ నుంచి కొలువుల్లో చేర్చుకోవాల్సి ఉండగా.. ప్రక్రియ వచ్చే ఆగస్టుతో ముగియాలి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు పునరాలోచన చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

‘కొలువుల్లోకి తీసుకోవడం ఆలస్యం కావొచ్చు...అది ఈసారి వచ్చే డిసెంబరు వరకు సాగవచ్చని సమాచారం ఉంది’ అని ప్రముఖ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి చెప్పారు. దేశంలోని సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలకు 80 శాతం వరకు ప్రాజెక్టులు అమెరికా, ఐరోపాల నుంచే వస్తాయి. ఆ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సందిగ్ధత నెలకొంది.





Untitled Document
Advertisements