ట్రూడో తీరు నాకేమీ ఆశ్చర్యం కలిగించదు, కెనడా ఉగ్రవాదులకు స్వర్గం వంటిది.. శ్రీలంక విదేశాంగ మంత్రి

     Written by : smtv Desk | Tue, Sep 26, 2023, 12:22 PM

ట్రూడో తీరు నాకేమీ ఆశ్చర్యం కలిగించదు, కెనడా ఉగ్రవాదులకు స్వర్గం వంటిది.. శ్రీలంక విదేశాంగ మంత్రి

రోజురోజుకి భారత్, కెనడాల మధ్య మొదలైన వివాదం ముదురుతుంది. కెనడా ప్రధాని ట్రూడో ప్రవర్తిస్తున్న తీరు పై శ్రీలంక భారత్ కు బాసటగా నిలిచింది. నేరుగా కెనడాను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాదులు కెనడాను సురక్షిత గమ్యస్థానంగా చేసుకున్నారని.. అందుకే ప్రధాని జస్టిన్ ట్రూడో ఎలాంటి ఆధారాల్లేకుండా దారుణమైన ఆరోపణలు (భారత్ పై) చేసినట్టు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే పేర్కొన్నారు. భారత్-కెనడా వివాదంపై ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘శ్రీలంక విషయంలోనూ కెనడా అదే విధంగా వ్యవహరించింది. శ్రీలంకలో మారణహోమం జరిగిందంటూ అవాస్తవాలు పలికింది. మా దేశంలో మారణహోమం జరగలేదని ప్రతి ఒక్కరికీ తెలుసు’’అని అలీ సబ్రే వివరించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆ దేశ పార్లమెంటులో ప్రకటన చేయడం ద్వారా ద్వైపాక్షిక వివాదానికి దారితీయడం తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత వ్యతిరేక, వేర్పాటు వాద, ఉగ్రవాద శక్తులకు కెనడా అడ్డాగా మారిందంటూ, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇక కెనడా పార్లమెంటులో నాజీ జవానును గౌరవించడంపైనా అలీ సబ్రే స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలసి పోరాడిన వ్యక్తికి కెనడాలో సాదర స్వాగతం లభించడాన్ని చూశాను. ఇది నిజంగా ప్రశ్నించతగినది. కొన్ని సందర్భాల్లో ట్రూడో నిరాధార, దారుణ ఆరోపణలు చేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించదు. శ్రీలంకలో మారణహోమం అంటూ ట్రూడో చేసిన ప్రకటనతో రెండు దేశాల సంబంధాలపై ప్రభావం పడింది’’అని అలీ సబ్రే పేర్కొన్నారు.





Untitled Document
Advertisements