బీట్రూట్ తో మీ హార్ట్ బీట్ పదిలం..

     Written by : smtv Desk | Fri, Mar 01, 2024, 09:59 AM

బీట్రూట్ తో మీ హార్ట్ బీట్ పదిలం..

బీట్రూట్ ఈ పేరు వినగానే దీనిని నోట్లో పెట్టుకుంటే ఎర్రగా మారిపోయే పెదవులు, నోరు గుర్తొస్తాయి. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసినా కూడా దీనిని తినడానికి ఎవరు పెద్దగా ఇష్టపడరు. కారణం దీని రుచి మరియు రంగు అలాంటిది మరి. అయితే, బీట్రూట్ లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
బీట్రూట్ లో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. దీనిలో బీటాలైన్స్, ఐరన్, మాంగనీస్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి. విటమిన్ కె, క్యాల్షియం, ఫోలేట్(విటమిన్ బీ9), విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ దుంప పచ్చిది తిన్నా.. వండుకొని తిన్నా.. జ్యూస్ చేసుకొని తాగినా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ ద్వారా బెటాలిన్స్ మనకు అందితే.. బీట్రూట్ తినడం ద్వారా మనకు అవసరమైన పీచుపదార్థం లభిస్తుంది. దాని ఆకులను ఆహారంగా తీసుకొన్నా.. మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది.
బీట్రూట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తనాళాల సమస్య నుంచి విముక్తి పొందవచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీనిలో ఉన్న నైట్రేట్స్ శరీరంలోకి వెళ్లిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ గా మారడం జరుగుతుంది. ఇది రక్తనాళాలను వ్యాకోచింప చేసి రక్తపోటును అదుపులోకి తీసుకువస్తుంది. రోజుకి 250 మి.లీ. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తపోటును అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. వైద్యున్ని సంప్రదించి వారి సలహా తీసుకొన్న తర్వాతే బీట్రూట్ జ్యూస్ తాగడం ప్రారంభించాలి.
అథ్లెట్లు బీట్రూట్ ను ఆహారంగా తీసుకోవడానికి చాలా ప్రాధాన్యమిస్తారు. దీనిలో ఉండే డైటరీ నైట్రేట్స్ అందుకు కారణం. ఇవి మన శక్తిని మరింత పెంచుతాయి. దీని వల్ల అలసటకు దూరంగా ఉండటంతో పాటు మరింత ఎక్కువ సమయం సాధన చేయగలుగుతాం. కాబట్టి రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసేవారు బీట్రూట్ తినడం లేదా బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది.
బీట్రూట్ లో ఇనార్గానిక్ నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేసే సమయంలో ఇవి శరీరం తక్కువ ఆక్సిజన్ ఉపయోగించుకొనేలా చేస్తాయి. దీని వల్ల అలసట రాదు. శక్తి సన్నగిల్లినట్లుగా అనిపించదు. కాబట్టి మరింత ఎక్కువ సమయం వ్యాయామం చేయగలుగుతాం. వ్యాయామం చేయడానికి రెండు మూడు గంటల ముందు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలోకి చేరిన రెండు మూడు గంటల తర్వాత నైట్రేట్స్ తమ ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాయి.ఫోలేట్, ఫైబర్, బీటాలైన్స్ ఈ మూడు పుష్కలంగా ఉండటం వల్ల.. బీట్రూట్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారంగా గుర్తింపు పొందింది.
కొందరికి తరచూ కడుపులో మంట వస్తుంటుంది. ఇలాంటి వారు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. తరచూ కడుపులో నొప్పి లేదా మంట రావడం అనారోగ్యానికి సూచన. ఊబకాయం, గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్య, క్యాన్సర్ల కారణంగా కడుపులో మంటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు తీసుకోవడం మంచిది. బీట్రూట్ లో ఉన్న బీటైన్, పీచుపదార్థం కాలేయంలోని టాక్సిన్లను బయటకు వెళ్లేలా చేస్తాయి. దీని వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయంలో జింక్, కాపర్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణం చెందడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతినవచ్చు. రక్తపోటు అదుపులో ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
NCBI వెబ్సైట్ ప్రకారం వారం రోజుల పాటు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి రావడం మాత్రమే కాకుండా.. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు తగ్గినట్టు తేలింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల బీట్రూట్ క్యాన్సర్ ను నివారించగలుగుతుంది. జంతువుల్లో పరిశోధన చేసినప్పుడు క్యాన్సర్ కణాల పెరుగుదలను బీట్రూట్ తగ్గించింది. దీనిలో ఉన్న బీటనిన్ ఈ ప్రభావాన్ని కలిగిస్తుంది. లుకేమియాతో బాధపడేవారు క్యారెట్, బీట్రూట్ కలిపిన జ్యూస్ ని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
మరి బీట్రూట్ తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా ఇకమీదట బీట్రూట్ కనిపిస్తే ముఖాన్ని విస్సుగ్గా పెట్టుకోవడం మానేసి తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.





Untitled Document
Advertisements