వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలి.. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

     Written by : smtv Desk | Sun, Mar 03, 2024, 07:39 AM

వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలి..  ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహం సిద్దం చేసుకుని అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతూ ముందుకు దుసుకులేతున్నాయి. అంతే స్థాయిలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల పై విరుచుకు పడుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి వివేక హత్య కేసు తెర మీదకు వచ్చింది. తాజాగా రాజకీయ లబ్ధి కోసం వివేకానంద్ రెడ్డి హత్య జరిగిందని పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

‘‘రాజకీయ లబ్ధి కోసమే వివేకానంద రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. గొడ్డలివేటుతోనే బాబాయ్ చనిపోయారని సీఎం అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగారు? సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తానని సునీత అంటే జగన్ ఎందుకు ఆపారు? హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన ఆయన..ఆ తరువాత వద్దనడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో ప్రజలకు చెప్పాల్సిందే. వివేకా ఎలా చనిపోయారో సీఎంకు తెలుసు. దానిని ఎందుకు దాచాలనుకుంటున్నారు? తండ్రిని హత్య చేసిన కేసులో తనకు న్యాయం చేయాలని సునీత పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్టు చేయకుండా జగన్ అడ్డుకుంటున్నారు’’ అని చినరాజప్ప విమర్శించారు. సునీత పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే పార్టీకి బదులు అభివృద్ధి సంక్షేమాన్నిచ్చే టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. మరి నిమ్మకాయల వాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయి అనేది చూడాలి.





Untitled Document
Advertisements