మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

     Written by : smtv Desk | Sun, Mar 03, 2024, 07:47 AM

మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలి.. ఏపీ హైకోర్టులో పిల్

తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు హైదరాబాద్ రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రాలు రెండుగా చీలిపోయిన తరువాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా నిర్ణయించినప్పటికీ ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగానే కొనసాగింది, ఎప్పటి వరకు ఏపీ రాజధాని పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2తో ముగుస్తున్నా, ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొన్నారు. కాబట్టి, 2034 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. మరి ఈ అపీల్ పై కోర్టు స్పందన ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి.

కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందన్నారు. విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టి పెట్టకపోవడంతో వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడే అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని నిబంధనలు అమలు కానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉందన్నారు.





Untitled Document
Advertisements