వైస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు ముహుర్తం ఖరారు ..

     Written by : smtv Desk | Sun, Mar 03, 2024, 07:53 AM

వైస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు ముహుర్తం ఖరారు ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీకి చెందిన ఎన్నికల మేనిఫెస్టోను సిద్దం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 10న మేనిఫెస్టోను ప్రకటించనుంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో నిర్వహించతలపెట్టిన నాలుగో ‘సిద్ధం’ మహాసభ వేదికగా సీఎం జగన్ ప్రకటించనున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. 100 ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల మందితో ఈ సభను నిర్వహించనున్నామని తెలిపారు. పలువురు మంత్రులు, కీలక నేతలతో కలిసి ‘సిద్ధం’ సభ సన్నాహకాలను శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ వివరాలను విజయసాయి రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘సిద్ధం’ మహాసభ ప్రచార గీతాన్ని, గోడపత్రాలను ఆవిష్కరించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాలుగు ఉమ్మడి జిల్లాల అధికారపార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

13, 14 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్!
ఈ నెల 13, 14వ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని విజయసాయి రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ సభ తర్వాత సీఎం జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు. 10న నిర్వహించనున్న సిద్ధం సభకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తామన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలను పరిశీలించి భవిష్యత్తులో పేదలకు మరిన్ని మెరుగైన పథకాలను మ్యానిఫెస్టోలో చేర్చుతామని చెప్పారు. మరి ఈసారి జగన్ ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మేనిఫెస్టో వెలువడే వరకు వేచి చూడాలి.






Untitled Document
Advertisements