పండ్లతో ఆరోగ్యమే కాదు అందం సైతం మీసొంతం..

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 09:08 AM

పండ్లతో ఆరోగ్యమే కాదు అందం సైతం మీసొంతం..

పండ్లతో ఆరోగ్యం మాత్రమే కాదు అందం కూడా పెంచుకోవచ్చు అదేలాగో తెలుసుకుందామా..

* కమలా ఫలం, పసుపు.. కమలా ఫలం సిట్రస్ జాతికి చెందిన పండు. దీనిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను ఇచ్చి అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. పైగా కమలాఫలం సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా మారిపోతుంది. కమలాఫలానికి పసుపు జోడించి ఫేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.ఈ ఫలితాన్ని పొందడానికి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కమలాఫలం రసంలో అర టేబుల్ స్పూన్ పసుపు పొడి కలపాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ప్యాక్ ను తొలిగించుకొని చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

* బొప్పాయి, పెరుగు.. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ స్కిన్ టోన్ మెరుగుపరిచి ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. పైగా ముఖంపై ఉన్న మచ్చలను సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో పెరుగుకు సాటి వచ్చేది ఏదీ లేదు. అలాంటిది ఈ రెండూ కలిపి ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకొంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది.బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి మిక్సీ ఆన్ చేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

* అరటిపండు, రోజ్ వాటర్, తేనె, పెరుగు .. అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మానికి పోషణను అందించి ముడతలు పడకుండా చేస్తాయి. రోజ్ వాటర్ ముఖం పై ఉన్న మచ్చలను చర్మం రంగులో కలసిపోయేలా చేస్తుంది. బాగా ముగ్గిన అరటిపండు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనిలో టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి బ్లెండర్ సాయంతో మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే సరిపోతుంది.





Untitled Document
Advertisements