తెలంగాణ వాసులను అల్లాడిస్తున్న సూర్యుడు.. .. మరో ఐదు రోజులు జగ్రత్త తప్పదన్న అధికారుల హెచ్చరికలు

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 10:29 AM

తెలంగాణ వాసులను అల్లాడిస్తున్న సూర్యుడు.. .. మరో ఐదు రోజులు జగ్రత్త తప్పదన్న అధికారుల హెచ్చరికలు

ప్రతి వేసవిలోనూ మార్చి నెల మధ్య నుండి ఎండలు క్రమంగా తమ ప్రతాపం చూపుతాయి అనే విషయం మనకు అనుభవమే. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రతాపం చూపిస్తున్న భానుడు మార్చిలో మరింతగా చెలరేగుతున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటేశాయి. ఈ వారంలోనే 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నిన్న సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మిగతా జిల్లాల్లో సరాసరి 38 డిగ్రీలు దాటేసింది. మరో ఐదు రోజులపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

గతేడాది మే 18న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి అంతకుమించి నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో అత్యధికంగా 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి మార్చి 3నే 37 డిగ్రీలు దాటేసింది. గతేడాది మార్చి 31న నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువకావడం గమనార్హం. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించి తమని తాము కాపాడుకోవడం ఉత్తమం.





Untitled Document
Advertisements