బీఎస్ఎఫ్ లో మొదటి మహిళా స్నైపర్ గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి..

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 11:11 AM

బీఎస్ఎఫ్ లో మొదటి మహిళా స్నైపర్ గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి..

ఒకప్పటి మహిళలు వంటింటికే పరిమితం అయితే నేటి మహిళలు గగన తలంలో విహరించే యుద్దవిమానాలను సైతం అలవోకగా నడిపే స్థాయికి ఎదిగారు. దేశ రక్షణ శాఖ వ్యవస్థను సైతం నిర్మలా సీతారామాన్ ఎంతో సమర్థవంతంగా నిర్వర్దించారు, దేశాన్ని శత్రుమూకల నుంచి రక్షించడంలో బీఎస్ఎఫ్ పాత్ర ఎంతటి ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఇంతటి కీలకమైన వ్యవస్థ పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. ఏ విధంగా దేశాన్ని రక్షిస్తుంది అనేది మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటువంటి ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఇండౌర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ ట్యాక్టిక్స్ (సీఎస్ డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. ఇటీవలే 'ఇన్స్ట్రక్టర్ గ్రేడ్' పొందారు. మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురితప్పకుండా కాల్పులు జరిపేవారిని 'స్నైపర్' లుగా పేర్కొంటారు. 2021లో బీఎస్ఎఫ్ చేరిన కుమారి.. పంజాబ్లో ఓ ప్లటూన్కు నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్ దాడుల ముప్పును గమనించారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందు కొచ్చారు. 8వారాలపాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం. ట్రైనింగ్లో ఎంతో ప్రతిభ కనబరిచారని.. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల, కృషి, నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. సుమన్ కుమారి సాధించిన ఈ విజయంతో ఆడది తలుచుకుంటే సాధించలేని ఏది లేదు అనేది మరోసారి రుజువైంది. సుమన్ తల్లి గృహిణి కాగా, తండ్రి ఓ సాధారణ ఎలక్ట్రిషియన్. సుమన్ కుమారి సాధించిన ఈ విజయానికి తలిదండ్రులు గర్వంతో పొంగిపోతున్నారు.





Untitled Document
Advertisements