లోక్‌సభ ఎన్నికలలో అక్కడ నుండి ఎవరు బరిలో దిగినా కాంగ్రెస్‌ను గెలిపించాలి: మంత్రి తుమ్మల

     Written by : smtv Desk | Tue, Mar 05, 2024, 09:12 AM

లోక్‌సభ ఎన్నికలలో అక్కడ నుండి ఎవరు బరిలో దిగినా  కాంగ్రెస్‌ను గెలిపించాలి: మంత్రి తుమ్మల

కొన్నిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను అన్ని జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేంద్ర అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు అధికారం కొరకు పోటి పడుతున్నాయి. రాష్ట్రంలో ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికలలో మల్కాజిగిరి స్థానంలో మరోసారి కాంగ్రెస్‌ జెండాను ఎగురవేయాలని పార్టీ నాయకులు, కేడర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో మల్కాజిగిరి సీటు నుంచి రేవంత్‌రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారని, ఈసారి కూడా పార్టీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్‌ నేత ముందుముల పరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని ఆయన ప్రస్తావించారు. ప్రజాపాలనలో రాష్ట్రంలోని ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలను చెల్లిస్తున్నామని అన్నారు. మూసీనది సుందరీకరణకు కృషి చేస్తున్నామన్నారు.

త్వరలోనే నామినేటెడ్ పదవులు
పార్టీ కోసం పని చేస్తున్నవారికి త్వరలోనే నామినేటెడ్‌ పదవులను ఇవ్వనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 15-16 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతు అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలను, సంస్థలను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. ఇక బీజేపీకి రాష్ట్రంలో కేడర్ లేదని అన్నారు. ఎటు నుండి ఎటు చూసిన కాంగ్రెస్ గెలుపు తథ్యం అని నొక్కి వక్కాణించారు.





Untitled Document
Advertisements