పాటలు పాడేందుకు పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్.. ఝార్ఖండ్ లో ఘటన

     Written by : smtv Desk | Tue, Mar 05, 2024, 02:08 PM

పాటలు పాడేందుకు పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్.. ఝార్ఖండ్ లో ఘటన

అమ్మాయిల పై జరుగుతున్న లైంగిక దాడులు ఎన్నిరకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఆగడంలేదు. పోలీసు, చట్టాలు, శిక్ష అనే భయం లేకుండా రెచ్చిపోతున్నాయి మానవ మృగాలు. తాజాగా ఝార్ఖండ్ లో మరో ఘోరం జరిగింది. ఇటీవల స్పెయిన్ మహిళపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యం మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడే యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి తనపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని ఛత్తీస్ గఢ్ కు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి వేడుకలో ప్రదర్శన ఇవ్వాలంటూ పాలాము జిల్లాకు పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఛత్తీస్ గఢ్ కు చెందిన యువతి ఆర్కెస్ట్రా బృందంలో పాటలు పాడుతుంది. ట్రూప్ తో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతుంది. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ కు చెందిన ఆర్కెస్ట్రా బృందం నిర్వాహకుడు గోలు ఓ ప్రోగ్రాం కోసం బాధితురాలిని పిలిచాడు. పెళ్లిలో ప్రోగ్రాం ఉందని, తన ట్రూప్ కు ఓ లేడీ సింగర్ కావాలని కోరడంతో బాధితురాలు తన సోదరితో కలిసి పాలాము జిల్లాకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ప్రోగ్రాం క్యాన్సిల్ కావడంతో బాధితురాలితో పాటు ఆమె సోదరికి గోలు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు.

చెరో గదిలో వసతి ఏర్పాటు చేసి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ కూల్ డ్రింక్ తాగాక తనను మత్తు ఆవరించిందని, అయితే తను మెలకువలోనే ఉన్నానని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆపై గోలు తో పాటు ముగ్గురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ రోజు రాత్రి పదే పదే రేప్ చేశారని పేర్కొంది. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో ఆడపిల్లలను ఎక్కడికైనా పంపాలంటే వారి తలిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు.





Untitled Document
Advertisements