అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ఎలా మొదలైందంటే..

     Written by : smtv Desk | Wed, Mar 06, 2024, 07:10 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ఎలా మొదలైందంటే..

ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే కేవలం వంటింటికే పరిమితం అన్నట్టుగా ఉండేది సమాజం. కానీ వంటిట్లో ఉండి కూడా కుటుంబాన్ని చక్కబెట్టారు. ఇంటి అవసరాలకు డబ్బుని పొదుపుగా వాడుతూ డబ్బు పొడుపు చేసారు. పిల్లలకు జబ్బుచేస్తే వంటింటినే వైద్యశాలగా మార్చారు. పాడి పనులలో ఇంటి యజమానికి తోడుగా నిలబడ్డారు. వ్యవసాయ పనులలో భాగం పంచుకున్నారు. వంటింటి కుందేలు అన్న బిరుదు ఉన్న నాడే ఇన్ని పనులు చేసిన నారి లోకం మారిన కాలంతో పాటు వంటిల్లు వదిలి బయట సమాజంలోకి అడుగుపెట్టింది. పురుషుడితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ.. డబ్బు సంపాదిస్తూ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు దేశానికి ప్రధానమంత్రులయ్యారు, .దేశాధ్యక్షులవుతున్నారు. అంతరిక్షానికి వెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం మగవాళ్ళే చేయదగ్గ పనులన్నింటినీ ఈనాడు ఆడవాళ్ళు చేస్తున్నారు. ఎన్నో రంగాలలో ఆడవాళ్ళు మరింత ముందుకు సాగుతున్నారు. ఈ ప్రగతిని చూసే ఒక సినిమా కవి - " లేచింది మహిళా లోకం - నిద్ర చేచింది మహిళా లోకం - దద్దరిల్లింది పురుష ప్రపంచం" అన్నాడు.
ఈ మహిళల చరిత్రలు ఎంతోమందికి మరింత ప్రేరణ కలిగిస్తాయి అనుటలో సందేహం లేదు.ముఖ్యంగా మహిళలు మరింత ఉత్తేజాన్ని పొందాలి. అప్పుడే తల్లి ఋణం తీర్చుకున్న తృప్తి కలుగుతుంది. ఈ ఆదర్శ మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు విజయపథం వైపు పయనించాలి.ఆడవాళ్ళు చదువుకుంటే ఎన్ని అధ్బుతాలు చేయవచ్చు.! మగవాడి చదువు అతనికే పరిమితం కానీ ఆడవాళ్ళ చదువు ఇంటింటి వెలుగు!

అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించటం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

మహిళ కష్టానికి గుర్తింపుగా ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
1908లో న్యూయార్క్ సిటీకి చెందిన 15 వేలమంది మహిళలు తమకు పనిగంటలను తగ్గించాలని, పురుషులతో సమానమైన జీతాన్ని ఇవ్వాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ప్రదర్శన ఫలితంగా 1909లో జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికే చెందినది కాదని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచించింది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల్లోని మహిళలకు చెందినదిగా ప్రకటించాలని పోరాటం చేసింది. 1910లో కోపెన్ హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చాలని ప్రతిపాదన చేసింది. ఆ సదస్సులో పాల్గొన్న 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు.

అలా తొలిసారిగా 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా... ఇలా ఎన్నో దేశాల్లో ప్రారంభమైంది. అయితే ఐక్యరాజ్యసమితి 1975వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్యం ఉద్దేశం లింగ సమానత్వం ఉండాలి , అంటే మగవారితో సమానంగా మహిళలకు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వారితో సమానంగా జీతాన్ని, విలువను, గుర్తింపును ఇవ్వాలన్నది .

ఇప్పుడు ఇప్పుడే క్రమంగా మళ్ళీ ఆడవాళ్ళు అన్నిట్లో రాణిస్తున్నారు. ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారు.ఇలాంటి సమయంలో మహిళల పట్ల ఎలాంటి వివక్షలు రాకుండా చూసుకోవడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం లక్ష్యం .





Untitled Document
Advertisements