ఆదర్శ మహిళగా, ఆదివాసీ నేతగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్థానం..

     Written by : smtv Desk | Thu, Mar 07, 2024, 09:39 PM

ఆదర్శ మహిళగా, ఆదివాసీ నేతగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్థానం..

నవమాసాలు మోసి , మరోజన్మ ఎత్తి బిడ్డ కు ప్రాణం పోసే ప్రాణ శక్తి స్త్రీ. భర్త ను సేద తీర్చే చైతన్య శక్తి స్త్రీ. మనిషిని పోరాట యోథునిగా తీర్చి దిద్దే శక్తి స్త్రీ. తన శ్వాసను వదిలైనా సరే బిడ్డకు శ్వాసను అందించాలని నిస్వార్థంగా కోరుకునే ప్రాణి ఈ భూమి మీద కేవలం ఆమె మాత్రమే. అందుకే వేదాలన్నీ ఆమెకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చాయి . కనుకనే ఆమె " వేద స్వరూపిణి " అయినది.అలాంటి స్త్రీ ఎన్ని కష్టాలు అయినా పడి దేశం కోసం , కుటుంబం కోసం ,రాజకీయ సామాజిక రంగంలో ,ఆర్థిక రంగాలలో సైన్యంలో బిజినెస్స్ లో ఎలా ఎన్నో రంగాలలో తన కంటూ ఒక ఉన్నత స్థానాన్ని కల్పిచుకునే మహిళలో ఒకరైన మన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..

రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల కెరీర్ లో రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఎదిగారు.

ఒడిశాకు చెందిన ఆదివాసీ మహిళా నేతగా ఉన్న 64 ఏళ్ల ద్రౌపదీ ముర్ము రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర లిఖించారు. వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొంది అందరి మన్ననలు అందుకున్న ద్రౌపదీ.. తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్ గా విశేష సేవలందించారు.


ద్రౌపది ముర్ము ప్రస్థానం:

ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా బైడపోసిలో గ్రామంలో 1958 జూన్ 20న సంతాలి గిరిజన కుటుంబంలో ద్రౌపదీ ముర్ము జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఆమె తండ్రి, తాత ఇద్దరూ గ్రామ సర్పంచ్ గా సేవలందించారు.

మొదట టీచర్ గా పనిచేసిన ద్రౌపదీ ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీలో చేరి రాయరంగపూర్ నగర్ పంచాయితీ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాయ్ రంగపూర్ నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ వైస్ ఛైర్ పర్సన్ గా పనిచేశారు. అంతేకాకుండా
రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
భాజపా- బిజూ జనతాదళ్ కలిసి ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో 2000 నుంచి 2004 మధ్య మంత్రిగా పనిచేశారు.
2010, 2013లో మయూర్ భంజ్ భాజపా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013లో భాజపా ఎస్టీ మోర్చా జాతీయ కార్య నిర్వాహక సభ్యురాలిగా ఉన్నారు.2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ .

ముర్ము వ్యక్తిగత ప్రస్థానం:


ద్రౌపదీ ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. 2014లో ఆయన మరణించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. భర్త, తన ఇద్దరు కుమారులను నాలుగేళ్ల వ్యవధిలో కోల్పోవడం ద్రౌపదీ ముర్ము జీవితంలో విషాదాన్ని నింపింది.ఆ బాధను దిగమింగుకుని ఆమె ప్రజా సేవకు అంకితమయ్యారు.

ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజనులకు దక్కలేదు. ఆ లోటును ద్రౌపదీ ముర్ము భర్తీ చేశారు. ముర్ము విశేష ప్రతిభాశాలి. మంత్రిగా, గవర్నర్ గా ఆమె మెరుగైన సేవలు అందించారు.ద్రౌపదీ ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి, స్ఫూర్తికి నిదర్శనం. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు.
ఈ విధంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశానికి ఆదర్శంగా నిలబడిన మహిళల గురించి గొప్పగా చెప్పుకోవడం మన అదృష్టం. అలాగే వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ గొప్పస్థాయికి ఎదగాలని smtv మనసారా కోరుకుంటుంది.





Untitled Document
Advertisements