అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా వాస్తవిక ప్రపంచం గురించి ఓ మహిళ మనోగతం..

     Written by : smtv Desk | Fri, Mar 08, 2024, 02:09 PM

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా వాస్తవిక ప్రపంచం గురించి ఓ మహిళ మనోగతం..

ప్రపంచ అంతటా మహిళాదినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వినిపిస్తుంటే ఓ సగటు మహిళ మాత్రం అందుకు భిన్నంగా మహిళా దినోత్సవం నాడు తన అంతరంగాన్ని ఆన్లైన్ వేదికగా అందరితో పంచుకుంది.. ఆమె అంతరంగం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

ఈ రోజు స్త్రీ గురించి నలుగురు చెప్పే మాటలు కొటేషన్ ల వరకే బాగుంటాయి.. నిజానికి స్త్రీకి ప్రత్యేకత అక్కర్లేదు మనిషిగా చూస్తే చాలు అంటాను నేను ..

నేను నమ్మే సిద్ధాంతం నాకంటూ ప్రత్యేకంగా ఉంటుంది.. నా దృష్టిలో స్త్రీ పురుషులిద్దరు సమానమే.. ఇంకా చెప్పాలి అంటే పురుషుడు అంటేనే గౌరవం ఎక్కువ నాకు..

నిజానికి స్త్రీకి స్వేచ్ఛ లేదు అంటారు కానీ.. అసలు స్వేచ్ఛ అంటూ లేని ఏకైక జీవి పురుషుడే అనేది నా అభిప్రాయం.. భర్తగా మారిన తరువాత కుటుంబ బాధ్యతలు మోయాలి భార్యని పిల్లలను ఎలాంటి కష్టం రాకుండా కడవరకు కంటికి రెప్పలా కాచుకుని ఉండాలి..

భార్యని సంతోష పెట్టేందుకు, కన్న పిల్లల సరదాలు కోరికలు తీర్చేందుకు ప్రతి నిమిషం తాను కష్టపడుతూ వాళ్ళని సుఖపెట్టేందుకు తాపత్రయ పడుతుంటాడు.

వాళ్లని సుఖ పెట్టే క్రమంలో తనకు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో భరిస్తాడే తప్ప పెదవి విప్పి నా బాధ ఇది అని ఎవరికీ చెప్పుకునే స్వేచ్ఛ అతనికి లేదు..

కనీసం మనసు బరువెక్కినప్పుడు కన్నీళ్లు కార్చే స్వేచ్ఛ కూడా మగాడికి లేదు ఒకవేళ ఏడిస్తే ఏంటా ఏడుపు ఆడదానిలా అని వెక్కిరిస్తారు.

మరి మగాడికి ఎక్కడుంది స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు రోడ్డున పడితిరగడమో, నచ్చినట్టు బ్రతకడమో కాదు..

నిజమైన స్వేచ్ఛ అంటే భావవ్యక్తికరణ, మన మనసులో ఉన్న బాధ సంతోషం దుఃఖం వేదన ఏదైనా సరే ఎలాంటి సంకోచము, ఎలాంటి జడ్జిమెంట్స్ లేకుండా ఎదుటి వ్యక్తి ముందు వ్యక్తపరచగలగడమే..

కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇలా పదిమందిలో తన ఎమోషన్స్ని వ్యక్తపరచే అవకాశం మగవాడికి అనాది నుండి లేదు..

స్త్రీ ఏడిస్తే అయ్యో పాపం అని జాలి చూపిస్తారు ఆమెకి అండగా ఉంటారు, ఆమెను ఓదారుస్తారు.. అదే ఒక మగవాడు ఏడిస్తే ఏంట్రా ఆడపిల్లలా ఏడుపు అంటూ అతన్ని సూటిపొటి మాటలతో వేదిస్తారు..

అంటే ఇక్కడ ఏడుపు అనేది ఒక ఆడపిల్లకు మాత్రమే ఆపాదించారు.. ఇక్కడ ఆడది అంటే ఏడవడానికి తప్ప దేనికి పనికిరాదు అన్నట్టుగా ప్రూవ్ చేస్తూనే.. మగవాడి గుండె బరువు దించుకుని హక్కుని అధికారాన్ని హరించేశారు..

సమాజంలో స్త్రీ పురుషుడు ఇద్దరూ సమానం అంటారు మరి ఎక్కడ ఉంది సమానత్వం? స్త్రీకి బాధ, కన్నీరు, చిన్న కష్టం వచ్చిన వ్యక్తపరిచే హక్కు ఉంది మరి పురుషుడికి ఎక్కడుంది ఆ హక్కు?

నా చిన్నతనంలో మా అమ్మ నాన్నలు ఇద్దరినీ దగ్గరగా చూశాను.. నలుగురం పిల్లలం ఒక్కోసారి పండగల వేళ మా నలుగురికి బట్టలు కొనాలంటే చేతిలో ఉన్న డబ్బు సరిపోదు అనే ఉద్దేశంతో అమ్మ తాను కొత్త బట్టలు కొనుక్కోవడం మానేసి మా నలుగురి కొరకు తన ఆనందాన్ని త్యాగం చేసింది.

సరైన పంటలు లేక సమయానికి చేతికి డబ్బు అందక ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మ కొత్త బట్టలు కొనుక్కోలేదు అనేది నిజమైతే..

మొగుడు చేతగానివాడు కనీసం పెళ్ళానికి బట్టలు కూడా కొనిపెట్టలేదు అనే సూటిపోటి మాటలు బంధువులవి..

పాపం ఇక్కడ కూడా చూడండి ఆర్థిక పరిస్థితులకు కూడా మగాడినే నిందిస్తుంది సమాజం.. కనీసం అమ్మకి ఆ రకమైన సానుభూతి అయిన దక్కింది కానీ నాన్న ఏం పాపం చేశాడని ఇందులో? ఇక్కడ నాన్న అంటే మగాడు నా దృష్టిలో

ఇక నాన్న తాను పాత బట్టలే ఇస్త్రీ చేసుకుని ధరించి చిరునవ్వుతో మా కోరికలన్నీ తీరుస్తూ ఉండేవారు. ఆయన పై సానుభూతి ఎవరికీ మరి?

ఓసారి నాన్న కాళ్ళకి చెప్పులు లేకున్నా కూడా నాకు షాప్ లో ఉన్న సైండిల్స్ నచ్చాయి అని అడిగితే నాన్న కొనుక్కోవాల్సిన డబ్బుతో నాకా చెప్పులు కొనిపెట్టి సంతోషించారు..

ఇప్పటికీ ఆ రోజు సంఘటన గుర్తొస్తే నా గుండె బరువెక్కి పోతుంది.. తెలిసి తెలియని తనం నాదైతే.. నాకు లేకున్నా పరవాలేదు నా కూతురు కోరిక తీర్చాలి అన్న తపన నాన్నది..

ఇక్కడ నేను ఎవరి పక్షము కాదు మామూలుగా మంచి చెడు గురించి మాట్లాడుతున్నాను.. నా వరకు నేను జెండర్ డిఫరెన్స్ ఎప్పుడు చూడను.. మనుషుల్లో చూసేది నేను కేవలం మంచి చెడు మాత్రమే..

నా మాటలు కొంతమంది ఫెమినిస్టులకి నచ్చకపోవచ్చు అందుకు నేనేం చేయలేను కానీ సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ మూలకారణమే. ఇద్దరికీ సమానమైన స్థాయి ఉంది సమాజంలో అని నేను నమ్ముతున్నాను..

మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే అందరూ స్త్రీలు బాధల్లో లేరు అందరూ పురుషులు సుఖాలలో మునిగితెలట్లేదు.. స్త్రీలని కష్టపెట్టె పురుషులు ఉన్నట్టే పురుషులను కష్టపెట్టె స్త్రీలు ఉన్నారు.. బాధపెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్..

భర్త బాధితులలాగే, భార్యా బాధితులు ఉన్న సమాజంలో బ్రతుకుతున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు అందుకే పాపం మగవాళ్ళ కష్టాలని గుర్తించగలిగినట్టు ఉన్నాను

మొత్తానికి ఏదైతేనే మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

మీ రచయిత్రి..

ఈవిడ మాటలు నిత్య సత్యమే కదా ఆలోచిస్తే నిజంగానే పురుషుడికి భావవ్యక్తీకరణ స్వేఛ్చ లేదు అనిపిస్తుంది.





Untitled Document
Advertisements